మరో వివాదంలో బాలకృష్ణ... క్షమాపణకు డిమాండ్!
బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. నర్సులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

బాలయ్య వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఆయన అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రోజుల వ్యవధిలో బాలయ్య పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ 'దేవ బ్రాహ్మణుల గురువు దేవర మహర్షి. వారి నాయకుడు రావణాసురుడు' అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలను దేవాంగ కులస్తులు తప్పుబట్టారు. చరిత్ర వక్రీకరించి మాట్లాడిన బాలయ్య దేవాంగ కులాన్ని కించపరిచారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో వెనక్కి తగ్గిన బాలయ్య క్షమాపణలు చెప్పారు. తెలియక చేసిన వ్యాఖ్యలే కానీ కించపరచాలనే ఉద్దేశం లేదని సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. అది జరిగిన రోజుల వ్వవధిలో మరో వివాదానికి తెరలేపారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో 'అక్కినేని తొక్కినేని' అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై ఏఎన్నార్ అభిమానులు సీరియస్ అయ్యారు. బాలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. ఏఎన్నార్ ని అవమానించిన బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో బాలకృష్ణ తన వ్యాఖ్యలు సమర్ధించుకున్నారు. ఆ విషయానికొస్తే ఏఎన్నార్ ని నా కంటే ఎవరూ అభిమానించరు, గౌరవించరు. ఆయనకు కూడా నేనంటే వల్లమాలిన అభిమానం అన్నారు. ఏఎన్నార్ ని అవమాన పరచాలనే ఉద్దేశం నాకు లేదన్నారు. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై నర్సులు అభ్యంతరం తెలిపారు. అన్ స్టాపబుల్ షో వేదికగా బాలకృష్ణ నర్సులను కించపరుస్తూ మాట్లాడారు. గతంలో కూడా బాలయ్య నర్సులపై అనుచిత కామెంట్స్ చేశారు. ఆయన తన మాటలు వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ నర్సుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈ మేరకు అల్టిమేటం జారీ చేశారు. ఈ వివాదంపై బాలకృష్ణ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ప్రస్తుతం ఆయన తారకరత్న ఆరోగ్యం పర్యవేక్షించడంతో బిజీగా ఉన్నారు. తారకరత్నను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తారకరత్న అనారోగ్య పరిస్థితుల కారణంగా బాలయ్య తన 108వ చిత్ర షూటింగ్ కి బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.