దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ సీతారామం విడుదలకు సిద్ధమైంది. దీనితో నేడు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సీతారామం ట్రైలర్ అంచనాలు అందుకుంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.


ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుండే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన తాజా చిత్రం సీతారామం. సస్పెన్సు ఎలిమెంట్స్ తో కూడిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దుల్కర్ కి జంటగా మృణాల్ ఠాగూర్ నటిస్తుండగా, రష్మిక మందాన కీలక రోల్ చేస్తున్నారు. ఆగస్టు 5న సీతారామం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు ట్రైలర్(Sita Ramam Trailer) విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఉత్కంఠరేపుతూ సాగింది. 

ట్రైలర్ లో రామ్, సీతామాలక్ష్మి ఎమోషనల్ లవ్ జర్నీతో పాటు వాళ్ళ కథ ఎలా ముగిసింది అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగింది. అనాధ అయిన లెఫ్టినెంట్ రామ్ కి సీతామాలక్ష్మీ ప్రేమ లేఖలు రాస్తుంది. తనకు పరిచయం లేని వ్యక్తి నుండి ప్రేమలేఖలు రావడం రామ్ ని అయోమయానికి గురి చేస్తుంది. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీతో ప్రజెంట్ రష్మిక(Rashmika Mandanna)కు సంబంధం ఏమిటనేది సస్పెన్సు ఎలిమెంట్. 20 ఏళ్ల క్రితం రామ్ తన ప్రేయసి సీతామాలక్ష్మి రాసిన లేఖ రష్మిక వద్దకు వస్తుంది. ఈ క్రమంలో రష్మిక సీతామాలక్ష్మి కోసం అన్వేషణ సాగిస్తుంది. 

అసలు లెఫ్టినెంట్ రామ్, సీతామాలక్ష్మీ ఏమైపోయారు. అసలు సీతామాలక్ష్మితో రష్మికకు సంబంధం ఏమిటనేది అసలు కథ. మొత్తంగా దర్శకుడు హను రాఘవపూడి కథ గురించి హింట్ ఇస్తూనే కొన్ని సస్పెన్సు ఎలిమెంట్స్ వదిలిపెట్టాడు. సీతారామం ట్రైలర్ అంచనాలు అందుకుంది. 

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుమంత్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, జిష్షు సేన్ గుప్తా ఇలా భారీ తారాగణం నటించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించగా పాటలతో పాటు, బీజీఎమ్ ఆకట్టుకుంది.