బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని కలవడానికి ముంబై వచ్చిన ఓ అభిమాని అక్షయ్ ఇంటి గోడ దూకి అతడిని కలిసే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ పట్టణానికి చెందిన అంకిత్ గోస్వామి బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కి వీరాభిమాని.

దీంతో అక్షయ్ ని కలవడం కోసం ముంబైకి వచ్చాయి. జుహులోని అక్షయ్ ఇంటికి వచ్చి లోపలకి వెళ్లడానికి ప్రయత్నించగా.. సెక్యురిటీ వాళ్లు అడ్డుకున్నారు. దీంతో తెల్లవారుజామున ఒంటిగంటన్నర ప్రాంతంలో అక్షయ్ ఇంటి గోడ దూకాడు. అది చూసిన సెక్యురిటీ గార్డులు అంకిత్ ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఆ యువకుడికి 22 ఏళ్ల వయసని, తాను అక్షయ్ కి వీరాభిమాని అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గూగుల్ సాయంతో అక్షయ్ ఇంటిని కనుగొన్న అంకిత్.. ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు.

పోలీసులు అరెస్ట్ చేసి అంకిత్ ని ప్రశ్నించగా... తాను కాలేజీలో  చదువుతున్నానని, అక్షయ్ ని కలవాలని ముంబై వచ్చి రాత్రి సమయంలో ఇంట్లోకి వెళ్లాలనుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. అంకిత్ సమాధానం విన్న పోలీసులు అతడి కుటుంబానికి సమాచారం అందించారు.