అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన అందాల భామ జాన్వీ కపూర్‌. తొలి సినిమా దడక్‌తోనే నటిగా మార్కులు సాధించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గుంజన్‌ సక్సెనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన జాన్వీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా చాలా కాలం పాటు తొలి మహిళా వైమానిక దళ పైలెట్‌ సక్సెనాతో గడిపింది జాన్వీ. ఆ అనుభవాల గురించి మాట్లాడుతూ `సినిమా షూటింగ్‌కు ముందు చాలా రోజుల పాటు సక్సేనాతో కలిసి గడిపాను. ఈ సందర్భంగా సక్సేనా ఎన్నో విషయాలు పంచుకుంది. మనం కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని గుంజన్ చెప్పింది. ఆమె ఎన్నో విజయాలు సాధించినా సింపుల్‌గా ఉంటుంది. ఆ విజయాలన్నీ ఆమె స్వశక్తితో సాధించింది` అని తెలిపింది.

`అయితే నాకు స్టార్ ఇమేజ్‌ ఉంది. అది నేను సాధించుకున్నది కాదు. ఆ విషయంలో నాకు చాలా గిల్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కష్టపడి నాకు ఉన్న స్టేటస్‌ స్థాయిలో ఏదైనా సాధించాలి` అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్‌. ఈ ఇంటర్వ్యూల పాల్గొన్న గుంజన్‌ సక్సేనా కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలి మహిళా వైమానికదళ పైలట్‌గా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పింది. తానే తొలి మహిళ కావటంతో `వాష్‌ రూమ్స్‌, డ్రెస్‌ చేంజ్‌ రూమ్స్‌ లేకపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొన్నాను. అదే సమయంలో నన్ను ఓ మహిళా అధికారికగా ప్రత్యేకంగా చూడకుండా ఓ అధికారిగా చూసేలా చేయటం అన్నింటికంటే కష్టమనిపించింది` అని ఆమె తెలిపారు.