సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతిలో బాలీవుడ్‌లోని చీకటి కోణాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా వారసత్వం కారణంగా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్‌ లేని నటీనటులను ఎదగనివ్వటం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై కొంత మంది బాలీవుడ్‌ ప్రముఖులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కంగనా రనౌత్‌ లాంటి వారు నెపోటిజం  మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సుశాంత్ మరణంతో మరింత మంది నెపోటిజంపై స్పందిస్తున్నారు.

తాజాగా యువ నటుడు గుల్షన్ దేవయ్య కూడా సుశాంత్‌ మృతిపై స్పందించాడు. మీరా చోప్రా బాలీవుడ్‌ అంతా ఒకే కుటుంబం అంటూ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన గుల్షన్ అదంతా అపోహ అంటూ కొట్టి పారేశాడు. `బాలీవుడ్‌ పరిశ్రమ ఒక కుటుంబం అంటారు. కానీ అది నిజం కాదు.. ఎప్పటికీ అలా జరగదు కూడా. బాలీవుడ్‌ అంతా ఒకటే అనేది ఓ అపోహ మాత్రమే. నేను ఎవరినీ విమర్శించాలని ఈ వ్యాఖ్యలు చేయటం లేదు. ఒక వేళ ఎవరైనా అలా భావిస్తే నన్ను క్షమించండి`` అంటూ ట్వీట్ చేశాడు గుల్షన్‌.

ఆదివారం ఉదయం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల చిచోరే సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సుశాంత్‌. సుశాంత్ హీరోగా తెరకెక్కిన చివరి చిత్రం దిల్ బెచారా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. సుశాంత్ అంత్యక్రియలు ముంబైలోని విలే పార్లీ స్మశాన వాటికలో జరిగింది.