సోషల్ మీడియా వేదిక మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీ పేర్లు వాడుకొని సోషల్ మీడియాలో తప్పుడు పనులు చేసేవాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇటీవల ఆర్‌ఎక్స్‌ 100 ఫేం దర్శకుడు అజయ్‌ భూపతి పేరుతో అమ్మాయిలను మోసం చేసేందుకు కొందరు ప్రయత్నించినట విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై అజయ్‌ పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా అలాంటి వ్యవహారమే మరోటీ తెర మీదకు వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరున్న గీతా ఆర్ట్స్ పేరును వాడుకొని ఆన్‌లైన్‌ మోసానికి తెర లేపారు కొందరు కేటుగాళ్లు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ అమ్మాయిలను ట్రాప్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో డిజైనర్‌, మేకప్‌ మేన్‌ అని చెప్పుకుంటూ అమ్మాయిలతో చాట్‌ చేస్తూ వారిని బుట్టలో వేసుకున్నాడు.

అయితే ఈ విషయం గీతా ఆర్ట్స్ దృష్టికి రావటంతో వారు సైబర్‌ క్రైం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. తమిళ సినిమాతో బన్నీకి జోడిగా నటించే ఛాన్స్‌ ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు వల వేసినట్టుగా గీతా ఆర్ట్స్‌ నిర్వహకులు తమ కంప్లయింట్‌లో పేర్కోన్నారు. ఆ మేరకు గీతాఆర్ట్స్ మేనేజర్‌ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.