బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా సాగుతుంది. అవినాష్‌ ఎంట్రీతో మరింత ఊపు వచ్చింది. మరోవైపు ఈ సారి గంగవ్వని కంటెస్టెంట్‌గా ఎంపిక చేసి తన ప్రత్యేకతని చాటుకుంది బిగ్‌బాస్‌4. మొత్తంగా షోకే స్పెషల్‌ ఎట్రాక్షన్‌ తీసుకొచ్చారు గంగవ్వ.

 మొదటి వారం సందడి చేసిన గంగవ్వ ఇప్పుడు డీలా పడిపోయింది. అనారోగ్యానికి గురయ్యింది. బిగ్‌బాస్‌ హౌజ్‌ తనకు పడటం లేదని వాపోయింది.తనని పంపించమని బిగ్‌బాస్‌ని వేడుకుంది. అయినా గంగవ్వ గట్టిదని, అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటారని, భయపడవద్దని తెలిపి గంగవ్వని హౌజ్‌లోనే ఉంచారు. ఆమె బలవంతంగానే ఉంటున్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే గంగవ్వ ఉంటుందా? ఈ వారం ఎలిమినేషన్‌లో వెళ్ళిపోతుందా? అనే చర్చ జరుగుతున్న క్రమంలో తెలంగాణ సీఎం పీఆర్‌ఓ స్పందించారు. ఆమెని బయటకు పంపాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ పీఆర్వో ర‌మేశ్ హ‌జారి ఫేస్‌బుక్‌లోనూ ఓ పోస్టు పెట్టారు. అస‌లు జైలు లాంటి బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్ళమని ఆమెని పంపింది ఎవరని ప్రశ్నించారు. అక్క‌డ అన్ని సౌకర్యాలుంటాయిగానీ, మనసున్న మనుషులు ఉండరని మండిపడ్డారు. చివరకు నవ్వుకు, ఏడుపుకి కూడా రేటింగ్‌లు కడతారని విమర్శించారు. 

`అక్క‌డ అవ్వ‌ ఆరోగ్యాన్ని ఎవ‌రు చూసుకుంటారు.  క‌నిపించ‌కుండా కేవ‌లం విన‌బ‌డే బిగ్‌బాస్ ఎవ‌రి బాగోగులు కోరే వ్య‌క్తి కాదు. నిన్ను బొమ్మ‌ను చేసి అడిస్తాడు. నీ శ‌క్తినంతా గుంజుకుంటాడు. నీ ఏడుపు అత‌నికి పైస‌లు కురిపిస్తాయి. బిగ్‌బాస్ జైలు నుంచి గంగ‌వ్వ‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి. మాన‌వ సంబంధాల‌ను బందీల‌ను చేసి ప‌రీక్ష పెడుతున్న బిగ్‌బాస్ జైలు నుంచి గంగ‌వ్వ‌ను విడుద‌ల చేయాల‌ని పోరాడుదాం. గంగ‌వ్వ‌ను జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి తీసుకువ‌ద్దాం` అని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.