`గామా అవార్డులకు సంబంధించి ఐదవ ఎడిషన్ ఈవెంట్‌కి రంగం సిద్ధమైంది. మరో ఆరు రోజుల్లోనే ఈ ఈవెంట్ జరగబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు నిర్వాహకులు.
ప్రతి ఏడాది అందిస్తున్న గామా(గల్ఫ్ అకాడమీ మూవీ ఆవార్డ్స్) అవార్డులకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాదికిగానూ అందించే అవార్డుల ఈవెంట్‌కి అన్ని రకాలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ ని ఆదివారం నిర్వహించింది టీమ్. దుబాయ్ వేదికగా ఈ సారి కూడా ఈ అవార్డుల వేడుక జరగబోతుంది. ఆగస్ట్ 30న ఈ ఈవెంట్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఆ విశేషాలను నిర్వాహకులు వెల్లడించారు.
నాన్నకి కళాకారులపై ఉన్న అభిమానంతో `గామా అవార్డుల` స్థాపన
ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో గామా అవార్డు సీఈవో సౌరబ్ కేసరి, ఈ అవార్డుల్లో భాగస్వామ్యం అవుతున్న వైభవ్ జ్యువెలర్స్ ఎండీ రాఘవ్, జ్యూరీ సభ్యులు దర్శకులు ఎం కోదండరామిరెడ్డి, బి గోపాల్, హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు. సందర్భంగా గామా సీఈవో సౌరబ్ కేసరి మాట్లాడుతూ, `ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈవెంట్ కాదు. మా నాన్న (త్రిమూర్తులు)కి కళాకారులపై ఉన్న అభిమానంతో గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నాం. అందరి సపోర్ట్ తో ముందుకు వెళ్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా అవార్డ్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఇతర దేశాల్లోను గామా అవార్డ్స్ ఇచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం. దుబాయ్ లో ఉన్న తెలుగు వారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్ ను నిర్వహించబోతున్నాం. జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డు విజేతలను ఎంపిక చేశాం` అని చెప్పారు.
అవార్డులు నటీనటులకు మల్టీవిటమిన్ టాబ్లెట్ లాంటివి
జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఏ కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ, `ఈ అవార్డ్స్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను, బి గోపాల్, కోటి సహా పలువురు ప్రముఖులతో కలసి జ్యురీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేసేలా ఉంటాయి. ఆగస్టు 30న దుబాయ్ లో జరగనున్న ఈ గామా అవార్డ్స్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
గామా అవార్డుల్లో గ్లామర్ స్పెషల్
జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు బి గోపాల్ గారు మాట్లాడుతూ, `గామా అవార్డ్స్ చైర్మన్ త్రిమూర్తులు ఈ అవార్డ్ ఫంక్షన్ ను ప్రతి ఏడాది చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతకుమించేలా సౌరబ్ కేసరి అన్ని ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారధుల సమక్షంలో హీరోయిన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ లతో ఈ ఈవెంట్ జరగనుంది" అని చెప్పారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ..`గతేడాది జరిగిన ఫోర్త్ ఎడిషన్ గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫార్మన్స్ చేశాను. ఈసారి కూడా స్పెషల్ పెర్ఫార్మన్స్ తో అలరించబోతున్నా" అని చెప్పారు. హీరోయిన్ మానస వారణాసి మొదటిసారి గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫార్మన్స్ చేయబోతున్నారని చెప్పారు. ఈ వేడుకలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ దక్షా నాగర్కర్ అన్నారు.
