విశ్వక్‌ సేన్‌ తాజాగా ఓ ప్రయోగాత్మక మూవీ `గామి`తో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఎంత వసూళ్లని రాబట్టిందంటే? 

విశ్వక్‌ సేన్‌ దమ్మున్న నటుడిగా నిరూపించుకుంటున్నాడు. ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తూ నటుడిగా నిరూపించుకుంటున్నాడు. తనపై అనేక విమర్శలు, వివాదాలు వెంటాడుతున్నా వాటిని ఎదుర్కొంటూ నిలబడుతున్నాడు. తన నటనతో, సినిమాలతో వాటికి సమాధానం చెబుతున్నాడు. తాజాగా ఆయన `గామి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీ విడుదలైంది. 

విద్యాధర్‌ రావు కగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించింది. అభినయ మరో ముఖ్య పాత్ర పోషించింది. ఇదొక అడ్వెంచరస్‌ మూవీగా తెరకెక్కింది. తనని మనిషి ముట్టుకుంటే బాడీలో మార్పులు వచ్చి స్పృహ తప్పిపడిపోతుంటాడు విశ్వక్‌ సేన్‌. దానికి మందు హిమాలయాల్లోని త్రివేణి పర్వతంపై మాలిపత్రి చెట్టులో ఉంది. ఆ మాలిపత్రిని పొందడం కోసం చేసిన సాహసమే ఈ సినిమా కథ. ఇందులో మరో రెండు స్టోరీలు అంతర్లీనంగా సాగుతాయి. వాటికి దీనికి సంబంధం ఏంటనేది సినిమా. 

సినిమా విజువల్‌గా అద్భుతంగా ఉంది. తెలుగు సినిమాల్లో ఇలాంటి విజువల్స్ ఇప్పటి వరకు చూడలేదనే చెప్పాలి. హాలీవుడ్‌ స్టయిల్‌ మేకింగ్‌ కనిపిస్తుంది. కానీ కథ విషయంలోనే లోపాలున్నాయి. స్క్రీన్‌ప్లే చాలా సంక్లిష్టంగా అర్థం కాని విధంగా ఉంటుంది. ఆడియెన్స్ కి అర్థం కావడం కష్టం. అదే సమయంలో చాలా లాజిక్‌లు మిస్‌ అయ్యాయి. దీంతో సినిమా మరింత కన్‌ఫ్యూజన్‌గా మారింది. ఇది సినిమాపై కొంత నెగటివ్‌ టాక్‌కి కారణమైంది. అయితే అర్బన్‌ ఆడియెన్స్ ని అంతో ఇంతో ఆకట్టుకుంటుంది. 

ఇక టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో సినిమాపై హైప్‌ ఏర్పడింది. ఆ హైప్‌ తొలిరోజు కనిపించింది. సినిమా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. దీనికితోడు మహాశివరాత్రి పండగ కూడా దీనికి కలిసొచ్చింది. ఇక తొలి రోజు 9.07కోట్ల గ్రాస్‌ సాధించినట్టు టీమ్‌ ప్రకటించింది. ఆల్మోస్ట్ నాలుగు కోట్ల షేర్‌ సాధించిందని చెప్పొచ్చు. ఈ సినిమా 11కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. శని, ఆది వారాల్లో సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి సినిమా హిట్టు, ఫ్లాప్‌ తేలనుంది.