ప్లాప్స్ లో ఉన్న హీరోయిన్ ని ఆదుకున్నారు పవన్. వరుసగా మూడు ప్లాప్స్ ఇచ్చిన యంగ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు.
తమిళ హిట్ వినోదయ సితం రీమేక్ క్యాస్ట్ ని నిర్మాతలు ప్రకటించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర కీలక పాత్రల్లో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజ్, రాజా చేంబోలు నటిస్తున్నారట. విషయం ఏమిటంటే... వరుస ప్లాప్స్ లో ఉన్న కేతిక శర్మకు ఆఫర్ ఇవ్వడం. రొమాంటిక్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన కేతిక శర్మ వరుసగా లక్ష్య, రంగ రంగ వైభవంగా చిత్రాలు చేశారు. ఈ మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో ఐరన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న కేతికకి పిలిచి మరీ ఆఫర్ ఇవ్వడం ఊహించని పరిమాణం.
ఇంకో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ పరిస్థితి కూడా అదే. ఆమె తెలుగులో నటించిన చెక్ ప్లాప్ అయ్యింది. ఇద్దరు ప్లాప్ హీరోయిన్స్ కి లైఫ్ ఇస్తున్న పవన్ గ్రేట్. అదే సమయంలో బడ్జెట్ తగ్గించుకోవడం కోసం నిర్మాతలు వీరిని సలెక్ట్ చేసుకున్నారని కూడా అనుకోవచ్చు. ఈ సినిమా బడ్జెట్ లో 70 శాతం పవన్ రెమ్యూనరేషన్ రూపంలోనే పోతుంది. ఆయన కేవలం 25 రోజులు రూ. 75-80కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి కేవలం లక్షల్లో తీసుకునే వీరిద్దరితో మూవీ పూర్తి చేద్దామని ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీ టాక్. అదే సమయంలో కథ రీత్యా హీరోయిన్స్ కి పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండకపోవచ్చు.
ఇక పవన్ కళ్యాణ్ ఈ మూవీ చిత్రీకరణ చకచకా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ఒక ప్రక్క సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒప్పుకున్న చిత్రాలు గట్టెక్కించాలని భావిస్తున్నారు. హరి హర వీరమల్లు సెట్స్ పై ఉండగానే వినోదయ సితం రీమేక్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో పవన్ పాత్ర నిడివి తక్కువ. మొదట పవన్ పార్ట్ షూట్ చేస్తారట. వీలైనంత త్వరగా వినోదయ సితం షూట్ నుండి పవన్ ని విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా మరో ఆరు నెలల్లో ఈ చిత్ర విడుదలవుతుందని అంటున్నారు. 2023 ఆగష్టులోనే వినోదయ సితం రీమేక్ రిలీజ్ చేస్తున్నారట. నిరవధికంగా షూట్ ని యూనిట్ ప్లాన్ చేశారట.
వినోదయ సితం సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవుతున్నాయి. రెడ్ షర్ట్ ధరించిన పవన్ కళ్యాణ్ కారుపై కూర్చొని ఉన్నారు. దర్శకుడు సముద్ర ఖని సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ లకు సీన్ వివరిస్తున్నారు. ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. దేవర, భగవంతుడు టైటిల్స్ కూడా పరిగణలో ఉన్నాయట. అయితే దేవుడు టైటిల్ నే ఫిక్స్ చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మూవీలో పవన్ భగవంతుడు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన చేసిన గోపాలా గోపాలా చిత్రాన్ని ఇది పోలి ఉంటుందని సమాచారం. తమిళంలో వినోదయ సితం చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించి నటించారు. ఒరిజినల్ వెర్షన్ లో సముద్రఖని చేసిన పాత్ర పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పవన్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేశారట.
