ఆర్ ఆర్ ఆర్ చిత్ర నిర్మాత డివివి దానయ్యతో రాజమౌళికి చెందిందని వార్తలు వస్తుండగా... ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆస్కార్ గెలవడం మీద తన స్పందన తెలియజేశారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ దక్కించుకుంది. రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి పేరు వరల్డ్ వైడ్ వినిపిస్తుంది. అయితే నిర్మాత డి వి వి దానయ్య మాత్రం మరుగున పడిపోయారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో రాజమౌళి బిజీగా ఉన్నారు. గోల్డెన్ గ్లోబ్ తో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి దక్కాయి. రాజమౌళి అండ్ టీం అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఎక్కడా నిర్మాత దానయ్య ప్రస్తావన తేలేదు. ఆయన పేరు పలికేందుకు ఇష్టపడలేదు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ లో సైతం దానయ్యకు క్రెడిట్ దక్కలేదు.
ఈ క్రమంలో రాజమౌళితో దానయ్యకు విభేదాలు తలెత్తాయి. ఇద్దరికీ ఎక్కడో చెడింది. కాబట్టే రాజమౌళి దానయ్యను నిర్లక్ష్యం చేశాడన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ గురించి ఇంత చర్చ జరుగుతున్నా దానయ్య మీడియా ముందుకు వచ్చింది లేదు. కనీసం సోషల్ మీడియాలో కామెంట్ చేయలేదు. ఇది వివాదాల వార్తలకు బలం చేకూర్చింది.
ఎట్టకేలకు దానయ్య మీడియాతో మాట్లాడారు. ఆయన పరోక్షంగా రాజమౌళితో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గొప్ప విషయం. దీనికి కర్త కర్మ క్రియ రాజమౌళినే. ఆస్కార్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఆస్కార్ గెలిచాక వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేశాను. అయితే ఈవెంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. దాంతో కుదర్లేదు.
నాటు నాటు సాంగ్ కోసం 17 రోజులు రిహార్సల్స్ నిర్వహించాము. ముప్పై రోజులు షూటింగ్ చేశాము. ఆ పాట కోసం పడ్డ కష్టానికి ఆస్కార్ రూపంలో ప్రతిఫలం దక్కింది. కరోనా కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిపోయింది. రాజమౌళితో 2006 నుండి జర్నీ చేస్తున్నాను. నాకు ఒక మూవీ చేయాలని అడ్వాన్స్ ఇచ్చాను. మర్యాద రామన్న చేయమన్నారు. కాదు పెద్ద సినిమా చేద్దామన్నారు. అయితే బాహుబలి ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యే వరకు వేచి చూడమన్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ తో పని చేసే అవకాశం ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ వంటి బడా ప్రాజెక్ట్స్ నిర్మిస్తానని అనుకోలేదు... అని దానయ్య చెప్పుకొచ్చారు.
