చంద్రబాబు మహానీయుడు.. దుర్మార్గంగా అరెస్ట్.. వారికి పుట్టగతులుండవ్: నిర్మాత అశ్వినీదత్ (వీడియో)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. చంద్రబాబును అరెస్ట్ అదొక దురదృష్టకరమైన రోజని అన్నారు.
‘‘చంద్రబాబు ఒక మహానీయుడు. ఈ దేశానికి ఓ గొప్ప ప్రధానిని, గొప్ప లోక్‌సభ స్పీకర్‌ను, ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన గ్రేట్ లెజెండరీ చంద్రబాబు నాయుడిని దుర్మార్గకరంగా అరెస్ట్ చేసి.. బీభత్సం సృష్టించిన వారికి కచ్చితంగా పుట్టగతులు ఉండవు. దీనికి పరిష్కారం ఎన్నో రోజుల్లో లేదు. మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రాగానే వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు’’ అని అశ్వనీదత్ అన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు కచ్చితంగా 160 సీట్లను కచ్చితంగా చంద్రబాబు గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు మరో సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా మంగళవారం చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చిత్రపరిశ్రమకు శ్రేయోభిలాషి వంటి వ్యక్తి అని నట్టి కుమార్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరూ స్పందించకపోవడం దారుణమని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ సహా ఇతరులెవరూ మద్దతు ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నారు. సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు.
పార్టీలకంటే వ్యక్తులు ముఖ్యమని నట్టి కుమార్ అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు సినీ ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయని.. ఇండస్ట్రీ కోసం వచ్చి నిలబడేవారని చెప్పారు. కేసు గురించి తాను మాట్లాడటం లేదని.. అది ఏం జరుగుతుందనేది వేరే విషయమని చెప్పారు. సుఖంగా ఉన్నప్పుడు వెళ్లి కావాల్సి తీసుకుంది దాచుకోవడం కాదని.. కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి తెలుపాల్సిన అవసరం ఉందని అన్నారు. కనీసం సోషల్ మీడియాలోనైనా పోస్టులు పెట్టకపోవడం దారుణామని అన్నారు.
టాలీవుడ్ పెద్దల తీరు బాగోలేదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. పవన్ ఇప్పటికే ముందడుగు వేశారని.. చంద్రబాబుకి మద్దతు ఇచ్చారని అన్నారు. వెనుకాల నుంచి మద్దతు తెలిపేవారు దొంగలని అన్నారు. ముందుండి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ హీరో అనిపించుకున్నారని అన్నారు. తాను టీడీపీకి దూరంగా ఉంటున్నప్పటికీ చంద్రబాబు నాయుడి మంచి వైఖరికి దగ్గరేనని చెప్పారు.