పంజాబీ నటుడు , సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మంగళవారం ఢిల్లీకి సమీపంలోని కుండ్లీ - మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్దూ మరణించారు
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ నటుడు , సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ (Deep Sidhu) రోడ్డు ప్రమాదంలో (road accident) కన్నుమూశారు. మంగళవారం ఢిల్లీకి (new delhi) సమీపంలోని కుండ్లీ - మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్దూ మరణించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
1984లో పంజాబ్‌లోని ముక్తసర్‌లో జన్మించిన ఆయన న్యాయవాద విద్యను అభ్యసించారు. కింగ్‌ఫిషర్ సంస్థ నిర్వహించిన మోడల్ హంట్‌లో విజేతగా నిలిచిన సిద్ధూ.. ఆ తర్వాత గ్రాసిమ్ మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని గ్రాసిమ్ మిస్టర్ పర్సనాలిటీ, గ్రాసిమ్ మిస్టర్ టాలెంటెడ్‌గా గెలిచారు. హేమంత్ త్రివేది, రోహిత్ గాంధీ వంటి డిజైనర్ల కోసం ఆయన ముంబైలో ర్యాంప్ వాక్ చేశారు.
మోడలింగ్ రంగంలో ఇమడలేక తిరిగి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు దీప్ సిద్ధూ. సహారా ఇండియా పరివార్‌కు న్యాయ సలహాదారుగా ఆయన సేవలందించారు. తర్వాత హమ్మండస్ అనే బ్రిటీష్ న్యాయ సంస్థలో సిద్ధూ పనిచేశారు. ఈ కంపెనీ డిస్నీ, సోనీ పిక్చర్స్, ఇతర హాలీవుడ్ స్టూడియోలకు న్యాయ సేవలు అందించింది. తర్వాత సిద్ధూ బాలాజీ టెలిఫిల్మ్స్‌కు లీగల్ హెడ్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఆయనను నటనవైపు రావాల్సిందిగా కోరారు. కానీ సిద్ధూ అందుకు ఒప్పుకోలేదు. 2015లో రామ్తా జోగి అనే సినిమా ద్వారా ఆయన సినీ రంగంలోకి ప్రవేశించారు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన దీప్ సిద్ధూ.. గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ (sunny deol) కోసం ప్రచారం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు (farm laws) వ్యతిరేకంగా రైతుల ఆందోళనలకు ఆయన మద్ధతుగా నిలిచారు. అయితే 2021లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా రైతులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న దీప్ సిద్ధూ.. చారిత్రక ఎర్రకోటపై (red fort) మతపరమైన జెండా ఎగురవేసినందుకు రైతు సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సిద్ధూ, గ్యాంగ్‌స్టర్ లఖా సిధనాలపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు.
కొందరు ఆందోళనకారులను రెచ్చగొట్టి ఆయనే వారిని ఎర్రకోట వైపు మళ్లించారనే ఆరోపణలు వున్నాయి. శాంతియుతంగా జరుగుతున్న రైతు ఉద్యమం దారి తప్పటానికి అతనే కారణమనే ఆరోపణలు వున్నాయి. ఈ కేసుల్లో కీలక నిందితుడిగా వున్న దీప్ సిద్ధూ ప్రస్తుతం బెయిల్‌పై వున్నారు.
