ప్రపంచ వ్యాప్తంగా సిని అభిమానుల్లో 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌ చిత్రాలకు ఉన్న  క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సిరీస్‌ నుంచి ఎనిమిది చిత్రాలు రాగా.. ఇప్పుడు తొమ్మిదో భాగం మనల్ని అలరించేందుకు రెడీ అవుతోంది. జాసన్‌ స్టాథమ్, డ్వేన్‌ జాన్సన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు డేవిడ్‌ లిచ్‌ తెరకెక్కించారు. దీనికి ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌: హాబ్స్‌ అండ్‌ షా’ టైటిల్‌ను ఖరారు చేసి రిలీజ్ చేస్తున్నారు. 

స్ట్రీట్‌ రేసింగ్‌ నేపథ్యంతో యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు ట్రైలర్ విడుదల చేసారు. 

ఈ సినిమాలో హాబ్స్‌ అనే లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా డ్వెయిన్‌, మాజీ మిలిటరీ అధికారి షా పాత్రలో జేసన్ నటించారు.  ఇడ్రిస్‌ ఎల్బా సైబర్‌ ఎనార్కిస్ట్‌గా విలన్  పాత్రను పోషించారు. అన్ని బడ్డీ మూవీస్ లో లాగానే హాబ్స్‌కు, షాకు ఒకరంటే ఒకరికి పడదు. కానీ విలన్  ఇడ్రిస్‌ ఎల్బా ని అంతం చేయటానికి ఇద్దరూ చేతులు కలుపుతారు.

‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌ నుంచి వచ్చిన ఎనిమిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్‌ డాలర్ల కలెక్షన్లు రాబట్టాయి.   ఈ  సినిమాను భారత్‌లో పది భాషల్లో విడుదల చేయబోతుంది యూనివర్సల్‌ పిక్చర్స్‌ ఇండియా సంస్థ. దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బోజ్‌పూరీ, పంజాబీ, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో ఈ మూవీ కనువిందు చేయబోతుందట. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన నేపథ్యంలో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.