బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ బ్రాండ్ల ప్రమోషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. బిగ్‌బాస్‌ పేరుతో `స్టార్‌మా` బాగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇతర బ్రాండ్లని `బిగ్‌బాస్‌` వేదికగా ప్రమోషన్‌ చేస్తూ భారీ ఆదాయాన్ని గడిస్తోంది. ఇప్పటికే ఓ కూల్‌డ్రింక్‌ కంపెనీని విపరీతంగా ప్రమోట్‌ చేసింది. ఆ తర్వాత ఓ దుస్తుల షోరూమ్‌ని ప్రమోట్‌ చేసింది. వీటితోపాటు బడ్జెట్‌ పేరుతో అనేక కంపెనీలను ప్రమోట్‌ చేస్తూనే ఉంది. అవి కాస్త రెగ్యులర్‌ ప్రమోషనే అనుకున్నప్పటికీ, తాజాగా ఓ ఊహించని కంపెనీని ప్రమోట్‌ చేసి అందరిని షాక్‌కి గురి చేస్తుంది. 

46వ రోజు ఎపిసోడ్‌లో అక్కినేని జంట నాగచైతన్య, సమంత కలిసి చేస్తున్న ఓ యాడ్‌ని ప్రమోట్‌ చేసింది. అంతేకాదు దాన్ని ఓ గేమ్‌గానూ పెట్టడం `బిగ్‌బాస్‌` అభిమానులను షాక్‌కి గురి చేస్తుంది. నాగచైతన్య, సమంత కలిసి `స్కాందాన్షి ఇన్‌ఫ్రా` అనే ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆ యాడ్‌ని సైతం గురువారం ఎపిసోడ్‌లో ప్రమోట్‌ చేశారు. 

ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టి ఆ యాడ్‌లో ఉన్న చైతూ, సమంతల ఫోటోని కరెక్ట్ గా పెడితే విన్‌ అయినట్టు లెక్కగా చెప్పారు. ఇందులో మెహబూబ్‌, నోయల్‌, సోహైల్‌, హారిక, లాస్య టీమ్‌ విన్ అయ్యింది. అయితే ఇందులో ఆ కంపెనీ కట్టే ఫ్లాట్‌ వివరాలు సైతం చెప్పడం గమనార్హం. వీటన్నింటిని చూసి నెటిజన్లు, బిగ్‌బాస్‌ అభిమానులు బాగా ఫీల్‌ అవుతున్నారు. వినోదం దేవుడెరుగు.. మీ ప్రమోషన్‌ బాగా చేసుకోండని కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటికే  ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆశించిన స్థాయిలో లేదని, పసలేదనే కామెంట్స్  వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమోషనల్‌ గేమ్స్ పెడుతూ ఆడియెన్స్ కి మరింత విసుగు తెప్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.