ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. యూఎస్ లో మార్చి 24నే ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది అక్కడ టికెట్స్ బుకింగ్స్ కూడా మొదలైపోగా సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది.
నందమూరి-మెగా కుటుంబాల మధ్య చాలా కాలంగా ఫ్యాన్ వార్ నడుస్తుంది. ఎన్టీఆర్ కి ధీటుగా చిరంజీవి (Chiranjeevi)పరిశ్రమలో ఎదిగారు. ఇక ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ స్టార్ హీరో హోదా దక్కించుకున్నారు. ప్రధానంగా చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మేము గొప్పంటే మేము గొప్పంటూ కొట్టుకునేవారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడిన సందర్భాల్లో ఈ ఫ్యాన్ వార్ మరింత ఎక్కువగా ఉండేది. ఇక చిరంజీవి తర్వాత ఆ కుటుంబం నుండి పవన్, చరణ్, బన్నీ స్టార్స్ గా ఎదిగారు. నందమూరి కుటుంబం నుండి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ అయ్యారు.
దర్శకుడు రాజమౌళి ఈ రెండు కుటుంబాలకు చెందిన స్టార్స్ తో మల్టీస్టారర్ సెట్ చేసి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. నిజానికి ఇది ఒక సంచలనం అని చెప్పాలి. ఓ దశాబ్దం క్రితం అయితే ఇది సాధ్యమయ్యేది కాదేమో. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan)మధ్య కొంతకాలంగా స్నేహబంధం ఏర్పడింది. వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. అదే సమయంలో నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ దూరం కావడం కూడా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి కారణం.
మరి హీరోలు ఒకటైనంత మాత్రాన ఫ్యాన్స్ కలిసిపోతారు అనుకుంటే అపోహే. దానిని రుజువు చేస్తే సోషల్ మీడియాలో ఎన్టీఆర్, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. యూఎస్ లో రికార్డు బుకింగ్స్ ఆర్ ఆర్ ఆర్ దక్కించుకుంటుంది. ఇదంతా మా హీరో క్రెడిట్ అంటూ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ అంటే ఎన్టీఆర్(NTR) సినిమా మాత్రమే అన్నట్లు వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో చరణ్ ఫ్యాన్స్ కూడా తగ్గడం లేదు.
నందమూరి, మెగా హీరోల ఫ్యాన్స్ సపరేట్ ట్యాగ్స్ క్రియేట్ చేసి తమ హీరోకి ఫేవర్ గా ట్రెండ్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో మా హీరో పాత్ర గొప్పంటే మా హీరో పాత్ర గొప్పంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్దల మధ్య అవగాహన కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించే థియేటర్స్ పంచుకున్న ఇరు వర్గాలు ఒక హీరో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన థియేటర్ వద్ద మరో హీరోవి కట్టకుండా జాగ్రత్తలు పడుతున్నారట. మరి హీరో స్నేహంగా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఇలా కొట్టుకోవడం ఒకింత ఇబ్బందికరంగా ఉంది.
