టాలీవుడ్‌లో స్పూఫ్‌లకు అల్లరి నరేష్‌ కేరాఫ్‌గా నిలిచేవారు. అనేక సినిమాల్లోని డైలాగ్‌లను తన సినిమాల్లో వాడేవారు. ఏకంగా స్పూఫ్‌తోనే ఓ సినిమా తీశారు. అది అన్ని సార్లు వర్కౌట్‌ కాదు. దీంతో అల్లరి నరేష్‌ ట్రెండ్‌ మార్చారు. 

ఇప్పుడు స్పూఫ్‌లతో కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్‌ సీన్లని స్పూఫ్‌ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్‌ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్‌ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దసరా పండుగని పురస్కరించుకుని `రామరాజుఫర్‌భీమ్‌` పేరు ఎన్టీఆర్‌ టీజర్‌ని విడుదల చేశారు. `రామరాజుఫర్‌భీమ్‌` టీజర్‌ ని అచ్ఛు గుద్దేశాడు జోషి అనే కుర్రాడు. ఎన్టీఆర్‌ స్థానంలో తాను భీమ్‌గా మారిపోయి వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉపయోగించి మరీ టీజర్‌ని స్పూఫ్‌ చేశాడు. ఇది విశేషంగా ఆకట్టుకుంది. ఇది చూసి ఇంప్రెస్‌ అయిన `ఆర్‌ ఆర్‌ ఆర్‌` నిర్మాత డి.వి.వి దానయ్య ఈ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. పిచ్చి(అభిమానం)కి అంతం అనేది లేదు. మీరు చంపేశారు. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరారు దానయ్య. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.