'ఈటీవీ' గ్రూప్ నుంచి ఓటీటీ,అయితే ఓ కండీషన్
ఇప్పటికే మంచి పాపులారిటీ ఉన్న అమెజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్, హాట్ స్టార్ లకు తోడుగా ఇప్పుడు ఈటీవీ గ్రూప్ నుండి ఓటీటీ సంస్థ రాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
కరోనా శకం మొదలయ్యాక అంతటా ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. ఆహా వంటి తెలుగు ఓటీటిలు మంచి బిజినెస్ చేస్తున్నాయి.అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, సన్ ఎన్ఎక్స్ట్, జీ 5 , స్పార్క్ వంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ తెలుగు కంటెంట్ ని స్ట్రీమింగ్ పెడుతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ని పంచుతున్నాయి. ఎన్ని ఓటీటీలున్నా… అన్నింటికి మంచి ఆదరణ ఉంది. వెబ్ సిరీస్ లతో పాటు చిన్న బడ్జెట్ సినిమాల కోసం జనం ఓటీటీలను ఫాలో అవుతున్నారు.ఈ క్రమంలో ఇప్పుడు 'ఈ'టీవీ కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతోందని సమాచారం.
రాబోయే రోజుల్లో ఓటీటీ కంటెంట్ రాజ్యమేలుతుందని భావించిన ప్రముఖ నిర్మాత రామోజీ రావు.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ప్రారంభించడానికి సంకల్పించారు. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో త్వరలోనే ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నారట. ఇక ఈటీవి ఓటీటి మార్కెట్ లోకి వస్తోందనగానే చాలా మంది చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను అమ్మచ్చనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడిప్పుడే ఈ కొత్త ఓటీటి వారు కొత్త సినిమాలు కొనదని, తమకు కావాల్సిన కంటెంట్ ని తామే తయారు చేసుకుంటుందానే ప్లాన్ అని చెప్తున్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వాటిని ఓటీటీ నుండి రిలీజ్ చేసేలా ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. సినిమాలు కూడా తమ సినిమాలే పెడదామనే ఫిక్స్ అయ్యారట.
ఈటీవీ వద్ద ఇప్పటికే కొన్ని వందల కొద్దీ సినిమాలున్నాయి. అలానే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన సినిమాలు వందకు పైగా ఉన్నాయి. క్లాసిక్ సినిమాతో పాటుగా కామెడీ షోలు - టాక్ షోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం ఈటీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.