సినిమా చెట్టు గురించి మీకు తెలుసా? 300 సినిమాల చిత్రీకరణ ఇక్కడే.. ఎన్నో హిట్లు..
వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సినిమా చెట్టు ప్రత్యేకత గురించి మాటల్లో చెప్పలేం. ఎందో అగ్రదర్శకుల మనస్సు దోచుకున్న ఈ చెట్టు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకీ సినిమా చెట్టు ఎక్కడ ఉంది? దాని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం..
గోదారి గట్టున ఉన్న ఈ సినిమా చెట్టు కథను మాటల్లో చెప్పలేం. దాని చరిత్ర, సెంటిమెంట్ వంద ఏళ్లకు పైగా కొనసాగుతోంది. 1964 నుంచి ఇప్పటి వరకు ఎన్నో వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ చెట్టు మీద షార్ట్ పడితే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం సినీ దర్శకులు, నటీనటులు బలంగా నాటుకుపోయింది. ఇన్ని వందల సినిమాల షూటింగ్ జరుపుకున్న ఈ చెట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం లో కుమారదేవం లో ఉంది. 150 ఏళ్ల కింద సింగలూరి తాతబ్బాయి అనే ఆయన నాటినట్లు అక్కడి స్ధానికులు చెబుతున్నారు.
సినిమా వాళ్లకు చిత్రీకరణ కోసం ఉన్న లోకేషన్లలో గోదావరి ఒకటి. గోదారి తీరంలో సినిమా తీస్తే మంచి ఫలితాలు ఉంటాయని చాలా మంది నమ్మకం. ఎందుకంటే అక్కడి నేచర్ అందాలు, సహజత్వం సన్నివేశాలను మరింత ప్రాణం పోసేలా ఉంటాయి. అందుకే లెజెండరీ దర్శకులు దాసరి నారాయణరావు, బాపు, కే విశ్వనాథ్ , కృష్ణవంశీ... క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఇక్కడే సినిమా తీసి హిట్లు కొట్టారు. టాలీవుడ్ అగ్రహీరోలు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్, మహేశ్ బాబు, బాలకృష్ణ, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి.
గోదావరి తీరంలో గల కొవ్వూరు నుంచి కుమారదేవం, పట్టిసీమ, పోలవరం, పాపికొండలు లాంటి ఆహ్లాదరకరమైన వాతావరణం షూటింగ్ లకు ప్రసిద్ధి చెందాయి. అందులోనూ ఈ సినిమా చెట్టు మరీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడి ప్రకృతి సోయగాలు, ఎత్తైన కొండలు, గోదారి తీరపు సౌందర్యం అగ్రదర్శకులు, నిర్మాతల మన్సును దోచుకుంది. మరోవైపు ఇక్కడ షూటింగ్ జరుపుకున్న 300కు పైగా సినిమాల్లో ఎన్నో హిట్ చిత్రాలుగా నిలిచాయి.
తొలుత ఈ చెట్టు దగ్గర 1964లో ‘మూగమనుసులు’ సినిమాను షూట్ చేశారు.సినిమాలోని ఓ పాటను చిత్రీకరించారు. అప్పటి నుంచి దీని ప్రభావం సినిమాలపై పడింది. కృష్ణ నటించిన ‘పాడిపంటలు’ చిత్రాన్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. చిరంజీవి ‘ఆపద్బాందవుడు, కృష్ణవంశీ ‘మురారీ’ వంటి సినిమాల్లోనూ ఈ చెట్టు దర్శనమిస్తుంది. రాజేశ్వరి కళ్యాణం, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, భద్రాచలం, అధిపతి, గోదావరి, నువ్వు లేక నేను లేను వంటి చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి.
రానురాను ఈ చెట్టు దగ్గర ఒక్క షార్ట్ అయినా తీయాలని, అక్కడే షూటింగ్ జరిపితే సినిమా హిట్ అవ్వడం ఖాయమనే నమ్మకం ఏర్పడింది. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్ని ఏళ్ల నుంచి అవుట్ డోర్ షూటింగ్స్ అనగానే ఫారేన్ కు వెళ్తున్న విషయం తెలిసిందే. ఎంత పరిణామం జరిగినా ఇప్పుడు కూడా ఇక్కడ షూట్స్ జరుగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లోని కొన్ని సీన్లను కూడాఇక్కడే చిత్రీకరించారు. ఇలా ఒకే లోకేషన్ లో, అదీ ఓ చెట్టు సినిమాల్లో పదేపదే కనిపించి రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. గోదారి గట్టునే ఉండే ఈ నిద్రగన్నేరు చెట్టు ఇప్పటికీ సినీ దర్శకులు, నటీనటులకు ప్రత్యేకంగా ఉంది.