డిఎంకే అధినేత ఎమ్.కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత జయలలితకు రాజకీయాల పరంగా పొసగని సంగతి తెలిసిందే. అయితే ఇద్దరూ కూడా సినిమాల బ్యాక్ గ్రౌండ్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారే.. జయలలిత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ వెండితెరకు పరిచయమయ్యి దాదాపు 140కి పైగా సినిమాల్లో నటించారు. 1960 నుండి 1980 వరకు తమిళ సినిమా ఇండస్ట్రీని తన గుప్పిట్లో పెట్టుకున్నారు.

రాజకీయాల్లోకి రాకముందు వరకు ఆమె నటిగా ఎంతో బిజీగా గడిపారు. ఆమె ప్రత్యర్థి కరుణానిధి కూడా తమిళ సినిమాలకు రచయితగా పని చేశారు. మరి వీరిద్దరూ కలిసి ఏ  సినిమాకు పని చేయలేదా అని సందేహం కలగక మానదు. అయితే ఇద్దరూ కలిసి ఓ సినిమాకు పని చేసినట్లుగా తెలుస్తోంది. 1965లో 'వెన్నిరా ఆడాయి' అనే చిత్రంతో తమిళనాట ఎంట్రీ ఇచ్చింది జయలలిత. అయితే ఆమె నటిగా సినిమాలు చేస్తోన్న సమయంలో కరుణానిధి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.

సినిమాల విషయంలో అంత యాక్టివ్ గా ఉండేవారు కాదు. అయినప్పటికీ 1966లో ఎస్.రాజేంద్రన్ డైరెక్ట్ చేసిన 'మని ముకుందం' అనే సినిమాకు కరుణానిధి రైటర్ గా పని చేశారు. ఆ సినిమాలో జయలలిత సెకండ్ హీరోయిన్ గా నటించింది. అదన్నమాట సంగతి.. ఇద్దరు ప్రత్యర్ధులు కలిసి ఓ సినిమాకు పని చేసిన మాట వాస్తవమే. అయితే ఇద్దరు దిగ్గజాలను కోల్పోయిన తమిళ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.