గతేడాది రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్‌ అయిన ‘దిశ ఎన్‌కౌంటర్‌’ ట్రైలర్‌ ఆనాటి ఘటనను కళ్లకు కడుతుంది. అయితే సినిమా రిలీజ్ ను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు విచారించారు. దిశపై లైంగిక దాడి, హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరఫు న్యాయవాది నివేదించారు. 

అలాగే ‘దిశ..ఎన్‌కౌంటర్‌’ సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఆదివారం ఉదయం రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు. దిశ సినిమాను ఆపాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నిర్మాత నట్టికుమార్‌ స్పందించారు. దిశ బయోపిక్‌ని తీయడం లేదని, మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు మళ్లీ జరగకూడదని చట్టానికి, న్యాయానికి లోబడి చిత్రాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. 

 గ‌తేడాది న‌వంబ‌ర్ 26న న‌లుగురు నిందితులు ఓ యువ‌తిని ల‌క్ష్యంగా చేసుకుని ఆమెపై అత్యాచారం చేసి నిప్పు పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే ఈ ఘ‌ట‌న‌పై సినిమా తీస్తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించారు. అంతే కాకుండా దిశ కేసులో నిందితుడైన చెన్న‌కేశ‌వులు భార్య‌ను క‌లిశారు. అదేవిధంగా శంషాబాద్ పోలీసుల‌ను కూడా క‌లుసుకున్నారు. ఆ కేసు గురించి పూర్తి వివ‌రాలు సేక‌రించిన వ‌ర్మ సినిమా చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి చేశాడు.