ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉదయ్ కిరణ్. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ ని షేక్ చేశాడు. చాలా తక్కువ సమయంలో స్టార్ హోదా అనుకున్నాడు. ఇండస్ట్రీలో అతడి ఇమేజ్ మరింత పెరిగిపోతుందని భావించారు.

కానీ కొన్నాళ్లకు అతడికి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో వాటిని తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఉదయ్ కిరణ్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఒక సినిమా తీయడానికి గల అంశాలు అతడి జీవితంలో ఉండడంతో ఉదయ్ కిరణ్ బయోపిక్ తో సినిమా వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి.

ఈ బయోపిక్ ని తేజ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. తేజ నిజంగానే ఉదయ్ కిరణ్ బయోపిక్ ని సినిమాగా తీయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం తేజ దగ్గర ప్రస్తావించగా.. దానికి అవకాశమే లేదని చెప్పాడు. ఉదయ్ కిరణ్ జీవితంలో ప్రతి విషయం తనకు తెలుసునని.. చనిపోవడానికి ముందు కూడా ఉదయ్ కిరణ్ తన జీవితంలో కష్టాలన్నింటినీ తనతో చెప్పుకొని బాధ పడినట్లు తేజ వెల్లడించాడు.

అతడి గురించి మొత్తం తెలిసినప్పటికీ సినిమా మాత్రం తీయనని తేజ స్పష్టం చేశాడు. అతడి కష్టాలు, కన్నీళ్లను క్యాష్ చేసుకోవాలని తాను భావించడం లేదు కాబట్టే సినిమా తీయనని చెప్పాడు. తేజ కాకపోతే మరే డైరెక్టర్ అయినా ఆ సాహసం చేస్తారేమో చూడాలి!