మత, కుల పరమైన అంశాలతో టాలీవుడ్ సినిమాలు ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటుంటాయి. దర్శకుడు తేజ లేటెస్ట్ మూవీ సీత. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 24 శుక్రవారం రోజు సీత చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. జోరుగా ప్రచార కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ఈ తరుణంలో సీత చిత్రం వివాదంలో చిక్కుకుంది. 

కాజల్ అగర్వాల్ తొలిసారి తన కెరీర్ లో రెబల్ లేడి తరహా పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో కాజల్ మోడ్రన్ సీతగా నటిస్తుండడం విశేషం. ట్రైలర్ లో చూపిన విధంగా కాజల్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి.కాజల్ పాత్రని మోడ్రన్ సీత అని అభివర్ణిస్తూ అభ్యంతరకరమైన సన్నివేశాలు చూపిస్తుండడంపై వివాదం చెలరేగింది. 

తేజ తెరకెక్కించిన సీత చిత్రం హిందువుల మనోభావాల్ని వ్యతిరేకించే విధంగా ఉందని భారతీయ యువమోర్చ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ చిత్రంపై సెన్సార్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటే విడుదలని అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. 

చాలా కలం తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత తేజకు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే అవకాశం వచ్చింది. కానీ విభేదాల కారణంగా ఆ చిత్రం నుంచి తప్పుకుని కాజల్ ప్రధాన పాత్రలో సీత చిత్రాన్ని తెరకెక్కించారు.