చిరంజీవి, సోనూ సూద్‌ కరోనా బాధితులను ఆదుకునేందుకు ఆక్సిజన్‌ ప్లాంట్లని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్ కూడా ఆక్సిజన్‌ ప్లాంట్‌ పెట్టేందుకు ముందుకొచ్చారు. కరోనాతో పోరాడుతున్నా వారికి ప్రాణవాయువు అందించేందుకు తనవంతుగా ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్‌ని ఏర్పాటు చేయబోతున్నారు సుకుమార్‌. తన సొంత పట్టణమైన కాకినాడలోని రాజోలులో docs80 ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్‌ని తన సొంత వ్యయంతో నిర్మిస్తున్నారు. 

రాజోలు మండలం మట్టపర్రుకి చెందిన బండ్రెడ్డి సుకుమార్‌ కోనసీమలో ఆక్సిజన్‌ బెడ్లు దొరక్క అవస్థలు పడుతున్న పేద కోవిడ్‌ రోగుల కోసం తన వంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అందు కోసం దాదాపు రూ.25లక్షలు విరాళంగా అందిస్తున్నారాయన. ఇప్పటికే తొలి విడతగా 40 లీటర్ల సామర్థ్యంతో కూడిన నాలుగు ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేసి అమలాపురంలోని అజాద్‌ ఫౌండేషన్‌కి అందజేశారు. అమలాపురంలోని తన స్నేహితుడు పంచాయితీరాజ్‌ డీఈఈ అన్యం రాంబాబుతో చర్చించి ఈ వితరణ కార్యక్రమం చేపట్టారు.

అజాద్‌ ఫౌండేషన్‌ కి సుకుమార్‌ సమకూర్చిన నాలుగు ఆక్సిజన్‌ సిలిండర్లని ఆ ఫౌండేషన్‌ ప్రతినిధులు బుధవారం కోవిడ్‌రోగులకు అందజేశారు. మరిన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల కొనుగోలు చేసి వాటిని కోవిడ్‌ రోగులకు అందుబాటులోకి తేనున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత వల్ల కోనసీమలో ఆక్సిజన్‌ బెడ్లు, సిలిండర్లు దొరక్క చనిపోయే పరిస్థితులు ఉండకూడదని సుకుమార్‌ గతంలో చెప్పారు. ఇప్పుడు ఏకంగా తన సహాయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్‌నే ఏర్పాటు చేస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్సిజన్‌  ప్లాంట్‌ నిమిషానికి 80 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం సుకుమార్‌ అల్లు అర్జున్‌ హీరోగా `పుష్ప` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో మరో సినిమా చేయబోతున్నారు సుకుమార్‌.