సమంత తెలుగులో `ఖుషి` చిత్రంలో చేయనున్న విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ చాలా కాలంగా ఆగిపోయింది. ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ నెలకొంది.  

సమంత, విజయ్‌ దేవరకొండ కలసి `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందుతుంది. ఓ సరికొత్త లవ్‌ స్టోరీతో, ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు దర్శకుడు. ఎమోషన్స్ ని ప్రధానంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నారు దర్శకుడు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రం షూటింగ్‌ పై సందిగ్దం నెలకొంది. సమంత అనారోగ్యానికి గురి కావడంతో కొన్ని నెలలుగా చిత్రీకరణని ఆపేశారు. ఆమె షూటింగ్‌లో జాయిన్ అయితేనే షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ సగం పూర్తయ్యిందని, విజయ్‌ దేవరకొండకి సంబంధించిన సన్నివేశాలు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. సమంత రిలేటెడ్ సీన్లు పెండింగ్‌లో ఉన్నాయని టాక్‌. ఆమె షూటింగ్‌కి వస్తే వేగంగా పూర్తి చేయాలని దర్శకుడు, టీమ్‌ భావిస్తుంది. 

కానీ సమంత షూటింగ్‌లో పాల్గొనేందుకు కొంత సమయం పట్టేలా ఉంది. ఆమె ఎప్పుడు చిత్రీకరణలో పాల్గొంటుందనే క్లారిటీ లేదని, దీంతో దర్శకుడు శివ నిర్వాణ ఆమెకి అల్టీమేటం ఇచ్చారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మార్చి మొదటి వారం వరకు సమంత రాకపోతే సినిమాని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు. అంతేకాదు వేరే సినిమాపై ఫోకస్‌ పెట్టాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. 

`ఖుషి` సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుంది. సినిమాకి సంబంధించి అన్నీ సజావుగానే జరుగుతున్నాయని` పేర్కొన్నారు దర్శకుడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అయితే ఫిబ్రవరి ఎండింగ్‌లోగానీ, మార్చి మొదటి వారంలోగానీ చిత్రీకరణ స్టార్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మార్చి నుంచి సమంత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందని చిత్ర యూనిట్‌ నుంచి అందిన సమాచారం. మరి అప్పటి వరకు సమంత రాకపోతే నిజంగానే శివ వేరే ప్రాజెక్ట్‌ కి వెళ్తాడా? సమంత కోసం వెయిట్‌ చేస్తాడా? అనేది చూడాలి. కానీ శివ చేసేందుకు మరే ప్రాజెక్ట్‌ ఫైనల్‌ కాలేదు. దీంతో `ఖుషి` కోసం, సమంత కోసం వెయిట్‌ చేయక తప్పదు అంటున్నారు సినీ జనాలు. 

సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిల్‌ అనే అరుదైన్య వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుంది. మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ పోయిన ఫిట్‌నెస్‌ని సాధిస్తుంది. అయితే ప్రస్తుతం సమంత `శాకుంతలం` సినిమాలోనూ నటించింది. ఇది ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో సమంత పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు హిందీలోనూ రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయ్యింది సామ్‌. ఆల్ రెడీ ఇప్పుడు హిందీలో సినిమాలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.