దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సమంత, చిన్మయి, అనసూయ. గుత్తా జ్వాలా వంటి వారు సోషల్ మీడియా వేదికగా సందీప్ రెడ్డిపై మండిపడ్డారు. దీంతో సందీప్ స్పందించక తప్పలేదు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుందని అన్నారు.

ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని అన్నానని.. అంటే దానర్ధం యువకుడు తాగొచ్చి అమ్మాయిని కొట్టడం కాదని అన్నారు. తాను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని.. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడానని.. కానీ దురదృష్టవశాత్తు తన వ్యాఖ్యలను తప్పుగా  అర్ధం చేసుకున్నారని అన్నాడు.

సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'కబీర్ సింగ్' సినిమా కారణంగానే ఈ వివాదం చోటుచేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీని హీరో షాహిద్ కపూర్ చెంపపై కొట్టే సన్నివేశం ఉంటుంది.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో సందీప్ ని ప్రశ్నిస్తే.. 'ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పుడు ఒకరినొకరు ముట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని' అన్నారు. ఈ వ్యాఖ్యలు యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, అమ్మాయిలను కొట్టమని ప్రోత్సహించడం ఏంటని సందీప్ పై మండిపడుతున్నారు.