సినిమా థియేటర్ మనిషి జీవితంలో ఒక భాగం అంటే అతిశయోక్తి కాదు. వినోద సాధనాల్లో సినిమా మొదటి స్థానంలో ఉండగా, అది ప్రేక్షకులకు దగ్గరకు చేర్చేది సినిమా థియేటర్. ఇష్టమైన హీరో కోసం ఫ్యాన్స్ చేసే హంగామా , భారీ కటవుట్స్, హిట్ సినిమా కోసం ఎగబడే ఆడియన్స్, బాక్సాఫీస్ ముందు బారులు తీసిన జనాలు, ఈలలు, గోలలు సినిమా థియేటర్స్ లోనే చూడగలం. ఆ అనుభూతిని ప్రేక్షకులకు దూరం చేసింది కరోనా మహమ్మారి. 

దాదాపు ఎనిమిది నెలలుగా థియేటర్స్ మూతబడ్డాయి. థియేటర్స్ కళకోల్పోయి, బూజు పట్టి దీనంగా ప్రేక్షకుల రాక కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికీ కరోనాకు పరిష్కారం దొరకకపోగా, ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి సినిమాకు వస్తారన్న గ్యారంటీ లేదు. దీని కోసం ప్రేక్షకులలో ధైర్యం నింపేలా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఓ ఎమోషనల్ వీడియో చేయడం జరిగింది. 

థియేటర్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మందికి జీవనాధారం అవుతాయో వారు వివరించారు. ఆ వీడారు దర్శకుడు పూరి జగన్నాధ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. మళ్ళీ ఆ రోజులు రావాలి, చొక్కాలు చిరుగాలి, విజిల్స్ మోగాలి, థియేటర్ మన అమ్మ అని పూరి జగన్నధ్ ఆ వీడియో గురించి చెప్పడం జరిగింది. పూరి ట్వీట్ చూస్తే అప్పటి థియేటర్ అనుభవాలు  గుర్తుకు వచ్చాయి. 

కాగా పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ చిత్రం చేస్తున్నారు. ఫైటింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. దాదాపు 50 శాతం వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం.