దర్శకుడు హరీష్ శంకర్ కు,ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది. ఆయనతో రామయ్య వస్తావయ్యా వంటి డిజాస్టర్ చిత్రం చేసినా,హరీష్ ని బాగా అభిమానిస్తూ ఉంటారు ఎన్టీఆర్. అలాగే హరీష్ శంకర్ ..కేవలం తన సినిమా తన స్క్రిప్టు, డైరక్షన్ అని మాత్రమే కాకుండా ఖాళీ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో సరదా సెటైర్స్, అప్పుడప్పుడూ సీరియస్ వార్నింగ్ లతో వార్తల్లో ఉంటూంటారు. తాజాగా తారక్ ఫ్యామిలీ ఫొటోపై హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్య వైరల్ అవుతోంది. ఇంతకీ హరీష్ ఏమన్నారో చూద్దాం.

నిన్నటినుంచీ నందమూరి అభిమానులు మరింత హుషారుగా ఉన్నారు. ఎన్టీఆర్‌ తన కుటుంబంతో కలిసి హోలీ సంబరాల్ని జరుపుకున్నారు. భార్య ప్రణతి, కుమారులు అభయ్‌రామ్‌, భార్గవ్‌రామ్‌తో కలిసి రంగులు పూసుకున్నారు ఎన్టీఆర్‌. ఆయన ఈ సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఇది చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యింది. ఫ్యామిలీ అంతా వైట్ డ్రెస్‌లో ముఖానికి రంగులు పూసుకుని ఉన్న పిక్ ఆకట్టుకుంటోంది.

సహజంగా తారక్ ఫ్యామిలీ ఫోటోకు నెటిజన్ల నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ లభించింది.ఈ నేపధ్యంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ ఫోటోపై స్పందించాడు. తనదైన శైలిలో ఎన్టీఆర్ చిన్న కొడుకు గురించి కామెంట్ చేశాడు. ‘ఎన్టీఆర్ చిన్న కొడుకు కెమేరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతోంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’.. అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.