రీసెంట్ గా ద్వితీయ వివాహం చేసుకున్న‌ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ  గొప్ప నిర్ణ‌యం తీసుకున్నారు. త‌ల్లిదండ్రుల అకాల మ‌ర‌ణంతో అనాథ‌లుగా మిగిలిన ముగ్గురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాంతో చాలా మంది టాలీవుడ్ సెలబ్రెటీలు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా పిల్లలు అంటే...

వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు స‌త్య‌నారాయ‌ణ ఏడాది క్రితం కాలం చేశాడు. అత‌ని భార్య అనురాధ కూడా ఇటీవ‌లే మ‌ర‌ణించారు. దీంతో ముగ్గురు పిల్ల‌లు అనాధల‌య్యారు. తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడే పెద్ద దిక్కుగా మారి త‌న చెల్లి, త‌మ్ముడి ఆల‌నా పాల‌నా చూసుకుంటున్నాడు. మీడియాలో వచ్చిన ఈ క‌థ‌నం ఎంతో మందిని క‌దిలించగా న‌టుడు సోనూసూద్ వారికి అండ‌గా నిలిచేందుకు ముందుకు వ‌చ్చారు.  

సోనూసూద్ ...ఆ పిల్లలు ఎంత‌మాత్రం అనాథ‌లు కార‌ని, వారి బాధ్య‌త తాను తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారిని మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌కు తీసుకువ‌చ్చి ఓ ఆశ్ర‌మంలో ఉంచుతాన‌ని తెలిపారు. అదే సమయంలో  టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం వారి ప‌రిస్థితికి చ‌లించిపోయారు. ఆ ముగ్గురిని ద‌త్త‌త తీసుకునేందుకు ముందుకు వ‌చ్చారు. వారి బాధ్య‌త‌ను త‌న భుజాల‌పై వేసుకుంటాన‌ని వెల్ల‌డించారు. అయితే ఆ ముగ్గురు పిల్ల‌లు ఈ ఇద్ద‌రిలో ఎవరి సంరక్షణకు వెళ్తార‌నేది ఇంకా నిర్ణ‌యించుకోలేదు.