బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజే మారిపోయింది. ఆ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలన్నీ పాన్‌ ఇండియా లెవల్‌లోనే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బాహుబలి తరువాత సాహో అనే యాక్షన్‌ అడ్వంచరస్ థ్రిల్లర్‌లో నటించాడు ప్రభాస్‌. ఆ సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా, కమర్షియల్‌గా మాత్రం మంచి వసూళ్లనే సాధించింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రొమాంటిక్ డ్రామాను కూడా పాన్‌ ఇండియా లెవల్‌లోనే తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను ప్రభాస్‌ పెదనాన కృష్ణం రాజు నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు ప్రభాస్‌. రాధకృష్ణ సినిమా తరువాత మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సోషియే ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ వరల్డ్ లెవల్‌ సినిమా అంటూ ఊరిస్తున్నాడు దర్శకుడు నాగ అశ్విన్‌. అంతేకాదు ఈ సినిమా ఓ సామాన్యుడిగా ఓ దేవ కన్య కూతురికి మధ్య జరిగే కథతో రూపొందుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు. గతంలో ప్రభాస్‌ హీరోగా మున్నా, మిస్టర్‌ పర్ఫెక్ట్ లాంటి సినిమాలను నిర్మించాడు దిల్ రాజు. అయితే అప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు, ఇప్పుడు వేరు. అందుకే ప్రస్తుతం ప్రభాస్‌ ఇమేజ్‌, మార్కెట్‌కు తగ్గట్టుగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడట. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా వేణు శ్రీరామ్‌ను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం దిల్ రాజు, పవన్‌ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్‌ సాబ్‌ను నిర్మిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా రిలీజ్‌ వాయిదా పడింది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాణంలోనే అల్లు అర్జున్ హీరోగా ఐకాన్‌ అనే సినిమాను కూడా రూపొందిస్తున్నాడు వేణు. ఐకాన్‌ సెట్స్ మీదకు వెళ్లక ముందే ప్రభాస్‌ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.