హీరో చియాన్ విక్రమ్‌కి హార్ట్ ఎటాక్ వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన తనయుడు హీరో ధృవ్ స్పందించారు.
తండ్రి, హీరో విక్రమ్ ఆరోగ్యానికి సంబంధించి వస్తోన్న వార్తలపై ఆయన తనయుడు, యంగ్ హీరో ధృవ విక్రమ్ ఘాటుగా స్పందించారు. గుండెపోటు అంటూ వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఫైర్ అయ్యారు. రూమర్స్ ని స్ప్రెడ్ చేయోద్దని, తమ వ్యక్తిగత లైఫ్‌కి ఇబ్బంది కలిగించవద్దని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి, శ్రేయోభిలాషులకు ఆయన ఒక నోట్‌ని విడుదల చేశారు.
ఇందులో ధృవ్ విక్రమ్ చెబుతూ, ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలియజేయునది.. నాన్న చిన్నపాటి చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆయనకు గుండెపోటు వచ్చిందనేది పూర్తిగా తప్పుదు ప్రచారం. ఇలాంటి రూమర్స్ పట్ల చాలా బాధగా ఉంది. ఈ సందర్భంగా నాన్నకి, తమ ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నా. నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆల్‌రెడీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నోట్ రూమర్స్ నకి సంబంధించి క్లారిటీ ఇస్తుందని నమ్ముతున్నా` అని వెల్లడించారు.
కాగా హీరో విక్రమ్ గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో విక్రమ్ చేరారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అంతా ఆందోళన చెందారు. సడెన్‌గా విక్రమ్ ఇలా ఆసుపత్రి పాలు కావడం, అదికూడా గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారనే వార్త అభిమానులను, సినీ వర్గాలను సైతం ఆందోళనకి గురి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కావేరి ఆసుపత్రి వైద్య బృందం విక్రమ్ హెల్త్ పై మెడికల్ బుల్లెటిన్ విడుదల చేసింది.
`విక్రమ్ ఈరోజు చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రిలో చేరారు. అనుభవం ఉన్న ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయనకు జస్ట్ చెస్ట్ లో పెయిన్ వచ్చింది. కానీ అది హార్ట్ ఎటాక్ కాదు. విక్రమ్ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జి చేస్తాం` అని ఓ బుల్లెటిన్ విడుదల చేసింది.
