కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మాణ సంస్థ మూతపడిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఈ హీరో అందులో నిజం లేదని స్పష్టం చేశారు. గతంలో ధనుష్ తన బ్యానర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 'కాలా' సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

ఆ తరువాత ధనుష్.. రజినీతో మరో సినిమా తీయలేదు. దీంతో సినిమా ఫ్లాప్ అవ్వడం వలనే ధనుష్.. రజినీతో మరో సినిమా తీయలేదని.. నిర్మాణ సంస్థను మూసేసే ఆలోచనలో ఉన్నాడని కోలీవుడ్ లో ప్రచారం జరిగింది. దీనిపై ధనుష్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

తన నిర్మాణ సంస్థ మూతపడడం లేదని.. రజినీ సర్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకపోవడం వలన ఇలాంటి వార్తలు వస్తున్నాయని అన్నారు. చాలా మంది నిర్మాతలు ఏడాదికి  ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటారని.. అలా అని వారు నిర్మాణ వృత్తికి దూరంగా ఉన్నట్లు కాదు కదా అని అన్నారు.

స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని.. అన్నీ కుదిరిన తరువాత త్వరలోనే సినిమాను ప్రకటిస్తామని చెప్పారు. ఏ నిర్మాణ సంస్థకైనా హిట్స్,ఫ్లాప్స్ సహజమేనని.. తమ బ్యానర్ నుండి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టాయని అన్నారు. రజినీ సర్ తో మళ్లీ కలిసి పని చేయాలనుందని.. మంచి స్క్రిప్ట్ వస్తే త్వరలోనే ఆయన్ని  సంప్రదిస్తామని అన్నారు.