హీరో ధనుష్‌, ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌లకు చెన్నై హైకోర్ట్ లో ఊరట లభించింది. వారిపై ఉన్న కేసుని కొట్టివేస్తూ కోర్ట్ తీర్పుచెప్పింది. సరైన ఆధారాలు లేవని హైకోర్ట్ ఈ కేసుని కొట్టేసింది.

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌లకు చెన్నై హైకోర్ట్ లో ఊరట లభించింది. వారిపై ఉన్న కేసుని కొట్టివేస్తూ కోర్ట్ తీర్పుచెప్పింది. సరైన ఆధారాలు లేవని హైకోర్ట్ ఈ కేసుని కొట్టేసింది. మరి ఇంతకి ఏం జరిగింది? ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌లపై ఉన్న కేసేంటి? అనే వివరాలు చూస్తే, తొమ్మిదేళ్ల క్రితం ధనుష్‌.. తమిళంలో `వేలైయిల్లా పట్టాదారి`(వీఐపీ) చిత్రంలో నటించారు. తెలుగులో ఇది `రఘువరన్‌ బి టెక్‌`గా విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. 

అయితే ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్‌ నిర్మాత. సినిమాలో ధనుష్‌పై శృతి మించి సిగరెట్లు కాల్చే సన్నివేశాలున్నాయని, కానీ ఆయా సన్నివేశాల్లో పొగతాగడం ఆరోగ్యానికి హానికరం వంటి చట్టపరమైన నిబంధనలు పాటించలేదని టుబాకో నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఆరోగ్య శాఖ దీనిపై చెన్నై, సైదా పేట కోర్ట్ లో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ధనుష్‌, ఐశ్వర్యరజనీకాంత్‌లకు కోర్ట్ నోటీసులు జారీ చేసింది. చాలా కాలంగా ఈ కేసు విచారణ జరుగుతూ వస్తోంది. 

ఈ నేపథ్యంలో ఇటీవల తమపై కేసుని కొట్టివేయాలంటూ ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ చెన్నై హైకోర్ట్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో తాము వ్యక్తిగతంగా హాజరుకాకుండా ఆదేశాలు జారీ చేయాలని వారు కోర్టుకి విన్నవించుకున్నారు. తాజాగా ఈ పిటిషన్‌ని హైకోర్ట్ విచారించింది. న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేష్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్‌ తరపున లాయర్‌ విజయ్‌ సుబ్రమణియన్‌ వాధించారు. ఈ వాదనల అనంతరం కేసులో సరైన ఆధారాలు లేవని పిటిషన్‌ కొట్టివేస్తున్నట్టు హైకర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ధనుష్‌, ఐశ్వర్యలకు పెద్ద రిలీఫ్‌ లభించింది.

ఇదిలా ఉంటే ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ 2004లో పెళ్లి చేసుకోగా, వీరికి ఇద్దరు కుమారులు. గతేడాది ఈ ఇద్దరు విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతా షాక్‌ అయ్యారు. అనంతరం రజనీ ఇద్దరి మధ్య రాజీకుదిర్చారని సమాచారం. ఇప్పుడు కలిసిపోయినట్టు తెలుస్తుంది. ఇక ధనుష్‌.. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. ఆయన ఈ ఏడాది `సార్‌` చిత్రంతో పెద్ద హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం `కెప్టెన్‌ మిల్లర్‌`,`తేరే ఇష్క్ మెయిన్‌` చిత్రంలో నటిస్తున్నారు. శేఖర్‌ కమ్ములతో ఓ సినిమా చేయాల్సింది. ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ కూడా ఆయన చేతిలో ఉంది. ఇక ఐశ్వర్య రజనీకాంత్‌ ఇప్పటికే దర్శకురాలిగా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆమె `లాల్‌ సలామ్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రజనీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.