`మహాప్రస్థానం`తో సంచలనం సృష్టించిన దేవా కట్టా మరో సంచలనానికి తెరలేపారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్నేహం ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. తాజాగా శుక్రవారం సినిమాకి `ఇంద్రప్రస్థం` అనే టైటిల్‌ ఖరారు చేస్తూ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. 

ఈ పోస్టర్‌లో చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తమ మార్క్ అభివాదం చేస్తున్న షేడ్‌ ఫోటోలను జోడించారు. వెనకాల  గొడవలను ప్రతిబింబిస్తున్నాయి. `నైతికత మారుతుంది. అధికారం కోసం జరిగే యుద్ధం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది` అని పోస్టర్‌ ఉన్న కొటేషన్‌ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రొడోస్‌ ప్రొడక్షన్స్ పతాకంపై హర్ష వీ, తేజ సీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై, ముప్పై ఏళ్ల కాల పరిమితిలో ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న చంద్రబాబు, వైఎస్‌ రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైనాన్ని, అందుకు దారి తీసిన అంశాలను ఇందులో చూపించబోతున్నారు దేవా కట్టా. ఇందులో వాస్తవాలతో కాస్త కల్పితాన్ని, డ్రామాని జోడించి తెరకెక్కించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ సందర్భంగా దేవా కట్టా స్పందిస్తూ, పోటీకి చెందిన ఉద్దేశం గెలుపు.. విజేతలుగా నిలవడం. విజేతలు ప్రపంచాన్ని నడిపిస్తారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆటలో బరిలోకి దిగినప్పుడు ఆ ఆటకుండే మజానే వేరు. అది అత్యంత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మారుతుంది` అని తెలిపారు.