ప్రభాస్-బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్... అనధికారిక ప్రసారాలు ఆపేయండి, ఢిల్లీ హైకోర్ట్ కీలక ఆదేశాలు!
అన్ స్టాపబుల్ అనధికారిక ప్రసారాలపై చర్యలు తీసుకోవాలంటూ అర్హ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రసారాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న ఈ టాక్ షోలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ పాల్గొంటున్నారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ పై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఈ ఎపిసోడ్స్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రసారానికి ముందే ప్రభాస్ ఎపిసోడ్ వీడియో బైట్స్ బయటకు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ కి సంబంధించిన ఫోటోలు లీక్ కావడం జరిగింది.
కొన్ని సోషల్ మాధ్యమాల్లో అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్స్ అనధికారికంగా ప్రసారం చేస్తున్నారు. ఇది అర్హ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో అర్హ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆహాకు మాత్రమే సొంతమైన అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ అనధికారిక ప్రసారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ సంస్థ తరపున లాయర్లు ప్రవీణ్ ఆనంద్, అమిత్ నాయక్ లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ కీలక ఆదేశారు జారీ చేశారు.
అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ అనధికారిక ప్రసారాలు నిలిపివేస్తూ మధ్యంతర ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేశారు. ఇతర మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న లింకులు, వీడియోలు తొలగించాలని టెలీకమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాగా డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు అన్ స్థాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది. సబ్స్క్రైబర్స్ అందరూ ఎపిసోడ్ చూసేందుకు ఆహా యాప్ కి లాగిన్ అయ్యారు. ఆ దెబ్బతో యాప్ క్రాష్ అయ్యింది. కొన్ని గంటల పాటు పని చేయకుండా పోయింది. నిర్వాహకులు ఎప్పుడో అర్ధరాత్రికి సేవలు తిరిగి పునరుద్ధరించారు.