కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రం భారీ అంచనాల నడుమ బుధవారం జూన్ 5న విడుదలకు సిద్ధం అవుతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఈ చిత్రంలో మరోసారి జంటగా నటించారు. దిశా పటాని కీలక పాత్రలో నటిస్తోంది. అలీ అబ్బాస్ ఈ చిత్రానికి దర్శకుడు.బ్రిటిష్ కాలం నుంచి మొదలయ్యే కథగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. 

సల్మాన్ ఖాన్ వివిధ గెటప్పులలో ఈ చిత్రంలో అలరించబోతున్నాడు. ఇదిలా ఉండగా భారత్ అనే మన దేశం పేరని, దానిని ఇలాంటి వాణిజ్య పరమైన చిత్రాలకు టైటిల్ గా వాడకూడదని వికాస్ త్యాగి అనే వ్యక్తి ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జూన్ 5న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో సత్వరమే విచారణ జరిపి సినిమా రిలీజ్ కు స్టే విధించాలని కోరాడు. నేడు ఈ పిటిషన్ విడిచారని ఢిల్లీ హై కోర్టు స్పెషల్ బెంచ్ ఆధ్వర్యంలో జరిగింది. 

వికాస్ త్యాగి వాదనని కొట్టిపారేసిన న్యాయస్థానం భారత్ చిత్ర విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో భారత్ చిత్రం ముందుగా అనుకున్నట్లుగానే జూన్ 5న యథాతధంగా విడుదల కానుంది. భారత్ చిత్రాన్ని కోర్టు స్టే విధిస్తుందేమోనని సల్మాన్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. 

దేశం పేరు, దేశానికి సంబంధించిన చిహ్నాలని వ్యాపార సంబంధింత కార్యకలాపాలకు ఉపయోగించకూడదనే నిబంధన ఉందని పిటిషనర్ తన వాదనలో తెలిపారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సినిమా చూడక ముందే ఓ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని న్యాయస్థానం సూచించింది. దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా సినిమా ఉంటే అప్పుడు మాత్రమే చర్యలు చేపట్టాలని కోర్టు పిటిషనర్ కు సూచించింది.