బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. ఆమె వెంట తండ్రి ప్రకాష్ పదుకొణె, సోదరి కూడా ఉన్నారు.  

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె శుక్రవారం తిరుమలలో తళుక్కుమంది. తన తండ్రి, బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణెతో కలసి ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంది. ప్రకాష్ పదుకొణె 67వ పుట్టిన రోజు కావడంతో స్వామి దర్శనానికి వారు విచ్చేశారు. దర్శనం తర్వాత ఆలయం ముందు భాగంలో మాస్క్ ధరించి దీపికా కెమెరాకు కళ్లకు చిక్కింది. దీపిక వెంట తండ్రితోపాటు సోదరి అనీష పదుకొణె కూడా ఉంది. అయితే ఆమె తండ్రి ఆరోగ్యం బాగుండాలనే శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తోంది. 

టీటీడీని సందర్శించిన సందర్భంగా దీపికా పదుకొణె ఫొటోలను ఆమె ‘లైవ్ లవ్ దీపికా’ అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీపిక చివరిసారిగా తన మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చింది. అప్పుడు ఆమె వెంట భర్త రణవీర్ సింగ్ (Ranveer Singh) కూడా ఉన్నారు. ఇటీవలే ఫ్రాన్స్ లోని కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీపిక పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో భాగంగా దీపికా ట్రెండీ వేర్స్ లో, వరుస ఫొటోషూట్లతో మతిపోగొట్టింది. ఇప్పటికీ ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 

దీపికా ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలను ప్రకటిస్తూ కేరీర్ లో దూసుకుపోతోంది. చివరిగా ‘గెహ్రైయా’ చిత్రంలో బోల్డ్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సరసన ‘పటాన్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే ‘సర్కస్, ప్రాజెక్ట్ కే, ఫైటర్’ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.