దర్శకరత్న, దివంగత దాసరి నారాయణ రావు కుటుంబంలో చాలా కాలంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాసరి మరణించిన తర్వాత ఆ వివాదాలు మరింతగా ఎక్కువయ్యాయి. తాజాగా దాసరి నారాయణరావు కుమారుడు దాసరి ప్రభు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఈనెల 9న దాసరి ప్రభు ఇంటి నుంచి బయటకు వెళ్లారట. అప్పటి నుంచి తిరిగి రాలేదని, ఎక్కడ వెతికినా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఇదే తరహాలో దాసరి ప్రభు 2008లో కూడా కనిపించకుండా పోయారు. ఆ తర్వాత తిరిగివచ్చి తన భార్య సుశీలే కిడ్నాప్ చేయించిందని ఆరోపించాడు. ప్రభుకి, అతని భార్య సుశీలకు చాలా కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి.ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య రిలేషన్ సరిగా లేదు. 

మరోమారు దాసరి ప్రభు అదృశ్యం కావడంతో కుటుంబ కలహాలే కారణం అని అంతా భావిస్తున్నారు. దాసరి ప్రభు, సుశీలది ప్రేమ వివాహం. దాసరి నారాయణరావు 2017లో అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.