Soubin Shahir: ‘కూలీ’, ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలతో గుర్తింపు పొందిన మలయాళ నటుడు షౌబిన్ షాహిర్ ప్రస్తుతం చీటింగ్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో కోర్టు నుంచి షాక్ ఎదురైంది.
Soubin Shahir: ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న మలయాళ నటుడు షౌబిన్ షాహిర్ (Soubin Shahir)చిక్కుల్లో పడ్డారు. కోర్టు తీర్పుతో దుబాయ్‌లో జరగనున్న సైమా (SIIMA) అవార్డుల వేడుకకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అసలేం జరిగింది? షౌబిన్ పై కోర్టు అంతా సీరియస్ కావడానికి గల కారణమేంటీ?
కోర్టులో పిటిషన్
‘కూలీ’, ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాలతో గుర్తింపు పొందిన మలయాళ నటుడు షౌబిన్ షాహిర్ ప్రస్తుతం చీటింగ్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసులో షౌబిన్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా (SIIMA) అవార్డ్స్‌కి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని షౌబిన్ కోర్టును ఆశ్రయించారు.
తిరస్కరణ
తన వృత్తిపరమైన బాధ్యతల నిమిత్తం వెళ్లాల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయ స్థాయిలో మలయాళ సినీ పరిశ్రమకు తాను ప్రాతినిధ్యం వహిస్తానని వాదించారు. అయితే, ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసులో కీలక సాక్షి దుబాయ్‌లోనే ఉన్నారని, షౌబిన్ విదేశాలకు వెళితే సాక్షిని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షౌబిన్ SIIMA వేడుకకు హాజరయ్యే అవకాశం కోల్పోయారు.
కేసు ఏంటీ?
‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా నిర్మాణానికి సంబంధించిన కేసు. ఈ చిత్రానికి షౌబిన్‌తో పాటు ఆయన తండ్రి, మరో వ్యక్తి నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే.. సిరాజ్ అనే వ్యక్తి .. తాను ఈ సినిమాకు రూ. 7 కోట్లు పెట్టుబడిగా పెట్టానని, లాభాలు వచ్చిన తర్వాత 40 శాతం వాటా ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించినా, తనకు రావాల్సిన వాటా ఇవ్వలేదని సిరాజ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎర్నాకులం పోలీసులు షౌబిన్‌తో పాటు ఇతరులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం షౌబిన్ మధ్యంతర బెయిల్‌పై ఉండగా, విచారణ కొనసాగుతోంది.
షౌబిన్ షాహిర్ సినీ జర్నీ
సౌబిన్ తన కెరీర్‌ను 2000లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించారు. తర్వాత నటుడిగా మారి, ‘సుదాని ఫ్రం నైజీరియా’, ‘కుంబలంగి నైట్స్’, ‘కూలీ’, ‘మంజుమ్మల్ బాయ్స్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘మంజుమ్మల్ బాయ్స్’ దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో ఆయన స్టార్‌డమ్ మరింత పెరిగింది. ఇటీవల రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు.
