గూఢచారి చిత్రంతో అడివి శేష్ ప్రశంసలు దక్కించుకున్నాడు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం స్పై థ్రిల్లర్ గా రూపొందింది. మరో మారు అడివి శేష్ అలాంటి థ్రిల్లర్ మూవీతోనే రాబోతున్నాడు. అడివి శేష్ ఇటీవల ఊహించని విధంగా తన కొత్త చిత్రం 'ఎవరు' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. 

ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు కూడా శేష్ ప్రకటించేశాడు. సినిమా కథ గురించి తెలియకుండా ఇన్నిరోజుల పాటు  సీక్రెట్ గా షూటింగ్ జరిపినట్లు శేష్ ప్రకటించాడు. దీనితో ఎవరు చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. 

తాజాగా ఎవరు చిత్రంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కథ కాపీ అంటూ ప్రచారం జరుగుతోంది. స్పానిష్ సూపర్ హిట్ చిత్రం 'ది ఇన్విజిబుల్ గెస్ట్' ఆధారంగా ఎవరు చిత్రం తెరక్కుతోందంటూ ఉహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనేది లేటెస్ట్ టాక్. 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బద్లా'. మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బద్లా చిత్రం ది ఇన్విజిబుల్ గెస్ట్ కు రీమేక్. చిత్ర యూనిట్ అధికారికంగా రీమేక్ హక్కులని సొంతం చేసుకుని కొన్ని మార్పులతో బద్లా చిత్రాన్ని రూపొందించారు. అడివి శేష్ కూడా ది ఇన్విజిబుల్ గెస్ట్ తెలుగు రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడా లేక ఆ చిత్ర ఆధారంగా ఎవరు చిత్రాన్ని రూపొందిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై 'ఎవరు' చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించలేదు.