ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో రాజకీయ రంగానికి చెందిన వారే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారు కూడా తమ మద్దతు తెలియజేశారు. 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన శాంతి స్వరూప్, వినోద్ లు కూడా జగన్ తో నడిచారు.

అయితే జగన్ పాదయాత్రలో పాల్గొన్న కారణంగా శాంతి స్వరూప్, వినోద్ లను 'జబర్దస్త్' షో నుండి తొలగించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై తాజాగా శాంతి స్వరూప్ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతి స్వరూప్.. జగన్ పాదయాత్రకి వెళ్లి తప్పుచేశామని అన్నారు. కానీ ఆ పాదయాత్రకి వెళ్లడం వలన తమను 'జబర్దస్త్' నుండి పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు.

'జబర్దస్త్' షో మానేసి పాదయాత్రకి వెళ్లామని.. తమకు లైఫ్ ఇచ్చిన 'జబర్దస్త్'కి ప్రాధ్యాన్యత ఇవ్వకుండా.. తెలియనితనంతో వెళ్లిపోయామని.. ఆ విషయాన్ని టీమ్ లీడర్స్ కి చెప్పామని.. కానీ వారు మేనేజ్ చేయలేకపోయారని చెప్పారు. తమ పాత్రలు భర్తీ చేయడానికి అక్కడ ఎవరూ లేరని.. ఈ విషయంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి కోపం లేదని.. కానీ ఇంకొకరు ఇలా చేయకూడదని మూడు నెలల పాటు తమపై నిషేధం విధించారని చెప్పారు.

తమని నమ్ముకొని స్కిట్లు రాసుకున్నప్పుడు ఇలా వదిలేసి వెళ్లడం తప్పని తెలుసుకునేలా చేశారని శాంతి స్వరూప్ వెల్లడించారు. జగన్ పాదయాత్రలో పాల్గొనడం వలనే తమను తీసేశారని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. కాకపోతే.. 'జబర్దస్త్' షోని వదులుకొని జగన్ పాదయాత్రలో పాల్గొనడం తప్పేనని శాంతి స్వరూప్ అంగీకరించారు.