ఈ రేంజ్ రెస్పాన్స్ కలలో కూడా ఊహించలేదు, ఇంకొక శ్యాంబాబుని క్రియేట్ చేయండి..కమెడియన్ పృథ్వీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో చిత్రం శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. తమిళ హిట్ చిత్రం వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో చిత్రం శుక్రవారం నుంచి థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. తమిళ హిట్ చిత్రం వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు.
బజ్ లేకుండా విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్రో చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. తాజాగా నేడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సాయిధరమ్ తేజ్, సముద్రఖని, థమన్, కేతిక శర్మ ఇలా చిత్ర యూనిట్ తో పాటు శ్రీవాస్, చందు ముండేటి, మారుతి , బాబీ, గోపీచంద్ మలినేని లాంటి దర్శకులు కూడా అతిథులుగా హాజరయ్యారు.
ఈ చిత్రంలో సముద్రఖని ఎంచుకున్న టైం అనే ఎమోషనల్ పాయింట్ కి ఎంతలా రెస్పాన్స్ వస్తుందో.. అదేస్థాయిలో మరో వైపు కమెడియన్ పృథ్వీ పోషించిన చిన్న పాత్ర శ్యాంబాబు కూడా కాంట్రవర్సీగా మారింది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు తరహాలో ఆయన డ్యాన్స్ తో ఈ పాత్రని సృష్టించారని అంటున్నారు.
సక్సెస్ మీట్ లో కమెడియన్ పృథ్వీ ఈ వివాదంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా పాత్రకి ఇంత రెస్పాన్స్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికే 20 ఇంటర్వ్యూలు చేశాను. అంత కాంట్రవర్సీ అయింది. కానీ ఈ మూవీలో అంతకి మించిన మంచి మ్యాటర్ కూడా ఉంది. దర్శకుడు సముద్రఖని మంచి సందేశంతో ఈ చిత్రం రూపొందించారు.
చాలా మంది మంత్రి అంబటి రాంబాబుని ఇమిటేట్ చేసారు కదా అని అడుగుతుంటే ఒకటే చెప్పా.. ఆయనెవరో నాకు తెలియదు. నేను ఇమిటేట్ చేయడానికి ఆయన ఆస్కార్ లెవల్ నటుడు కూడా కాదు అని చెప్పా. చేయాల్సిన పని వదిలేసి, ఫ్యామిలీని పట్టించుకోకుండా బార్లు అమ్మాయిల చుట్టూ తిరిగే వెధవ పాత్ర అని చెప్పారు. అదే నేను చేశా అని పృథ్వీ అన్నారు.
నేను పాలిటిక్స్ కి వెళ్లి తిరిగి వచ్చినప్పటికీ ఇండస్ట్రీ మళ్ళి నన్ను అక్కున చేర్చుకుంది. రచయితలు ఇక నుంచి నా కోసం మరిన్ని శ్యాంబాబు పాత్రలు క్రియేట్ చేయాలి అని పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.