Asianet News TeluguAsianet News Telugu

కాజల్ ‘కోమాలి’ రివ్యూ

కొన్ని ఐడియాలు ప్రారంభంలో వినటానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. అయితే అవి ట్రీట్మెంట్ చేసేటప్పుడు, తెరకెక్కేటప్పుడు మెల్లిమెల్లిగా రొటీన్ బాట పడుతూంటాయి. అలాంటి ఐడియానే ఈ రోజు రిలీజైన తమిళ డబ్బింగ్ సినిమా కోమాలి ది. పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే? అనే కథాంశంతో ‘కోమాలి’ రూపొందింది. పదహారేళ్లకు, ఇప్పటికి సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. మారిన పరిస్థితులకు హీరో అలవాటు పడ్డాడా? అనేది ఎప్పుడూ ఆసక్తిగొలిపే అంశమే. అయితే అంతే ఇంట్రస్ట్ తో డైరక్టర్ ఈ సినిమాని డీల్ చేసారా..అసలు కథేంటి..తెలుగు వాళ్లకు నచ్చుతుందా ఈ తమిళ డబ్బింగ్ సినిమా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

Comali telugu movie Review jsp
Author
Hyderabad, First Published Dec 4, 2020, 3:24 PM IST

కథేంటి

 స్కూల్ స్టూడెంట్ అయిన  రవి (జయం రవి)ని వాళ్ల నాన్న అనేక నీతిగా,పద్దతిగా బ్రతికేలా ఉండటం నేర్పిస్తాడు. రవి తన క్లాస్ మేట్ నిఖిత (సంయుక్త హెగ్డే) ను ప్రేమించి ఆమెను ప్రపోజ్ చెయ్యాలనుకుంటాడు. కానీ ధైర్యం లేక ఆగిపోతాడు. మొత్తానికి ఆ ధైర్యం తెచ్చుకుని ఆమెకు ప్రపోజ్ చేసే సమయానికి అనుకోని ఓ అవాంతరం వచ్చి పడుతుంది. ధర్మరాజు అనే గూండా తన రైవల్ ని చంపి తప్పించుకునే క్రమంలో వీళ్ళ మధ్యకు వస్తాడు.  నిఖితను అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. రవికి ఆమెను రక్షించే క్రమంలో తలకు దెబ్బ తగులుతుంది. కోమాలోకి వెళ్లిపోతాడు.  16 సంవత్సరాలు తర్వాత రవి కోమాలోంచి బయిటకు వస్తాడు. రవి కోమాలో ఉన్న ఇన్నేళ్లలో ప్రపంచం చాలా మారిపోయింది. టెక్నికల్ గానూ డవలప్ అయ్యింది. 

కుటుంబంలోనూ చాలా మార్పులు వచ్చాయి, అతని తండ్రి చనిపోయాడు. తన సోదరి తన క్లోజ్ ప్రెండ్ మణి (యోగిబాబు)నే పెళ్లి చేసుకుంది. ఇక కోమాలో నుంచి బయిటకు వచ్చిన రవిని ఇన్నాళ్లుగా ట్రీట్ చేసిన డాక్టర్...ప్రెండ్,బావ అయిన మణిని పిలిచి...అతను ఇన్నేళ్ల తన జీవితం మిస్ అయ్యాడు. కాబట్టి అతని కోరికలు ఏమైనా ఉంటే తీర్చండి. లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవటమో లేక చుట్టూ ఉన్నవాళ్లను ఎవరో ఒకళ్లను చంపటమో చేస్తాడు అని చెప్తారు. అక్కడ నుంచి మణి కష్టాలు మొదలవుతాయి.రవి తన మొదటి కోరికగా..తన కోమాలోకి వెళ్లక ముందు ప్రేమించిన నిఖిత ని చూడాలని , ఆమెను పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఆమె ఇంటికి వెళ్తారు. 

అయితే ఆమెకు ఇప్పటికే పెళ్లైపోయింది. అయితే నిఖిత తన భర్తను తన పాత లవ్ స్టోరీతో ఇబ్బంది పెట్టడం ఎందుకని..అసలు నిన్ను అప్పుడు ప్రేమించలేదని చెప్తుంది. దాంతో నిరాశకు గురి అయిన రవికు ఓ లవర్ ని సెట్ చేస్తే అన్ని సెట్ అవుతాయనుకుంటాడు. అప్పుడు పరిచయం అవుతుంది రితిక(కాజల్ అగర్వాల్). అక్కడ నుంచి వాళ్ల లవ్ స్టోరీ ఏ మలుపు తిరిగింది. ఈ ఆధునిక ప్రపంచంలో రవి ఎలా ఎడ్జస్ట్ అయ్యాడు,లోకల్ పొలిటీషియన్ ధర్మరాజు(కెఎస్ రవికుమార్ )తో రవికు ఉన్న గొడవ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

  
ఎలా ఉందంటే...

వాస్తవానికి ఈ కథలో కాంప్లిక్ట్ ..హీరో కోమాలోంచి వచ్చినప్పుడు పుట్టలేదు. హీరో ప్రెండ్ యోగిబాబుకు అతన్ని అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకుని , అతని కోరికలు తీర్చమన్నప్పుడు మొదలైంది. ఓ రకంగా ఇది యోగిబాబు కథ. అతనికే హీరో ఓ సమస్యలా మారతాడు. దాంతో హీరో తెరపై చేసిందేమీ పెద్దగా కనపడదు. ఇప్పటి ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోవటం, అమాయకంగా ప్రశ్నించటం వంటివి చేయటంతోనే సరిపోయింది. దాంతో యోగిబాబుని మనం ఫాలో అవుతాం కానీ హీరోని ఫాలో అవ్వలేము చాలా సేపు.

ఇక ప్లాట్ విషయానికి వస్తే...చాలా సంవత్సరాల తర్వాత ఓ వ్య్తక్తి కోమాలోంచి బయిటకు వచ్చి ఈ ప్రంపంచంలోకి ప్రవేశిస్తే...ఏమౌతుంది అనేది నావల్టితో కూడిన ఇంట్రస్టింగ్ ప్రిమైజ్. ఇలాంటి కథనుంచి  చాలా ఎక్సపెక్ట్ చేస్తాం. చాలా ఇంట్రస్టింగ్ సీన్స్  తో  సినిమా మొత్తం నిండి ఉంటుంది అనుకుంటాం.  అయితే స్టోరీ ఐడియాని డవలప్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్న క్రమంలో ఈ నావల్టి మొత్తం మాయమైపోవటం దర్శకుడు గమనించినట్లు లేరు. ఫస్టాఫ్ పెద్దగా ఏమీ కదలినట్లుండదు కానీ ఫన్ తో పంచ్ డైలాగులతో ఎంటర్టైన్ చేస్తుంది. అదే సెకండాప్ అప్పటిదాకా నడిచిన దారిని మర్చిపోయి ప్రక్కకు వెళ్లిపోతుంది. మెలోడ్రామా ఎక్కువైపోయి విసుగిస్తుంది.  

అయితే ఇప్పటి రోజుల్లో ఉండే కొన్ని కఠిన వాస్తవాలను ఈ సినిమా  చూపించగలిగింది. అయితే కొన్ని సార్లు ఏదో ఉద్బోథ లా మారింది.  మరీ ముఖ్యంగా హీరో క్యారక్టరైజేషన్ సరిగ్గా రాసుకోలేదు. ఓ చోట కష్టపడి ఫేస్ బుక్ వాడటం నేర్చుకున్న హీరో ..ఆ తర్వాత ఇంటర్నెట్ దేనికి పనికొస్తుందో తెలియనట్లు బిహేవ్ చేస్తాడు. ఇలాంటి సీన్స్ అడపా,దడపా మనలని ఇబ్బంది పెడతాయి. కామెడీ సినిమా కదా అని సరిపెట్టుకోవాలి. అయితే జయం రవి కొన్ని ఎపిసోడ్స్ లో తన అమాయికత్వం, మారిన కాలం లో వచ్చిన మార్పులు తెలియక చేసే చేష్టలు మాత్రం బాగా నవ్విస్తాయి. 

 ఇక ఈ సినిమా బాగుండేది టచింగ్ క్లైమాక్స్ అని చెప్పాలి. 2015లో వచ్చిన చెన్నై వరదల నేపధ్యాన్ని వాడుకుంటూ కొన్ని రియల్ లైఫ్ మూవ్ మెంట్స్ ని చూపించటం కలిసొచ్చింది. ఈ సీక్వెన్స్ లో జయం రవి, సంయుక్త, సారా ,యోగి బాబు కలిసి నెగిటివ్ ని వెతికే సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. అంతేకాదు 90 ల నాటి పిల్లల ఆరుబయిట ఆడుకునే ఆటలకు, ఇప్పటి పిల్లలు ఇంట్లో గాడ్జెట్స్ తో ఆడుకునే ఆటలకు మధ్య వ్యత్యాసాలను చూపే ప్రయత్నం చేయటం కూడా నచ్చుతుంది. 

ఎవరెలా చేసారు..

జయం రవి ఓ టీనేజర్ గా కనపడటం అందుకు పడ్డ కష్టం మెచ్చుకోబుద్దేస్తుంది. సినిమాలో అతను పాత్ర ప్యాసివ్ గా ఉన్నా ఎంగేజ్ చేయగలిగాడు. ఇక కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది. మరో ప్రక్క కన్నడ నటి సంయుక్త హెడ్గే మాత్రం బాగా చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అదరకొట్టింది. యోగిబాబు ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. వరస పంచ్ లు వేస్తూ దుమ్ము రేపాడు. ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ కామెడీ టచ్ ఉన్న విలన్ గా బాగున్నారు.

దర్శకత్వం మిగతా విభాగాలు

ఆల్రెడీ ఈ సినిమా తమిళంలో క్రితం సంవత్సరం రిలీజైంది. దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ ఈ సినిమా తో పరిచయం అయ్యారు. కొన్ని సీన్స్ చాలా సీనియార్టి ఉన్నట్లు చాలా బాగా తీసినా, తను ఏదైతే ఈ సినిమాలో చెప్పాలనుకున్నాడో ఆ కోర్ ఐడియాని మాత్రం సరిగ్గా ప్రెజెంట్ చేయలేదనిపిస్తుంది. ఇక హిప్ హాప్ తమీజా  పాటలు యూత్ ఫుల్ గా ఉన్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా లౌడ్ గా ఉంది. రిచ్చర్డ్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. ఎడిటర్ ప్రవీణ్..ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యారు.  

ఫైనల్ థాట్

డబ్బింగైన ప్రతీ సినిమా గొప్పగా ఉండాలని రూల్ లేదు
---సూర్య ప్రకాష్ జోశ్యుల
 Rating: 2.5/5

ఎవరెవరు...
నటీనటులు: ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్, సంయుక్తా హెగ్డే, యోగిబాబు, కె.ఎస్. రవికుమార్ తదితరులు. 
 సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటింగ్ : ప్రదీప్ ఈ. రాగవ్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్
సంగీతం: ‘హిప్ హాప్’ తమిజ్ 
నిర్మాత : ఇషారి కె.గణేష్
విడుదల తేదీ: 04,డిసెంబర్ 2020
రన్నింగ్ టైమ్: 141 నిముషాలు
స్ట్రీమింగ్ ఓటీటి: ‘జీ 5’
 

Follow Us:
Download App:
  • android
  • ios