టాలీవుడ్ కమెడియన్ పృథ్వి వైఎస్ జగన్ కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసిపిలో చేరిన పృథ్వి వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీకి ప్రచారం చేశారు. గత కొన్ని రోజులుగా పృథ్విపై మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.  పృథ్వి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించడం వల్ల అభిమానులు, మెగా క్యాంప్ అతడిపై ఆగ్రహంతో ఉందని వార్తలు వస్తున్నాయి. 

 

పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శల వల్ల పృథ్వి చిత్ర పరిశ్రమలో అవకాశాలు కోల్పోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి పృథ్విని తొలగించారని వార్తలు వచ్చాయి. దీనిపై పృథ్వి తాజాగా వివరణ ఇచ్చాడు. 

 

అల్లు అర్జున్ సినిమాలో నటించమని అసలు నన్ను ఎవరూ సంప్రదించలేదు. అలాంటప్పుడు ఆ చిత్రం నుంచి నన్ను ఎలా తీసేస్తారు అని పృథ్వి ప్రశ్నించారు. అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశం తనకు రాలేదని పృథ్వి తెలిపాడు. బన్నీ సినిమా నుంచి తనని తొలగించారంటూ వస్తున్న వార్తల్లో అర్థం లేదని పృథ్వి అభిప్రాయపడ్డారు. నాకు మెగా ఫ్యామిలీపై చాలా గౌరవం ఉంది. దయచేసి ఇలాంటి పుకార్లు సృష్టించవద్దు, ఎవరూ నమ్మవద్దు అని పృథ్వి కోరాడు.