పెద్ద సినిమాలకు టికెట్‌ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ సినిమాలకు, బిగ్‌ స్టార్స్ కి పెద్ద ఝలక్‌ ఇచ్చారు. 

టికెట్‌ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు 

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భారీ బడ్జెట్‌ చిత్రాలకు, పాన్‌ ఇండియా మూవీస్‌కి, బిగ్‌ స్టార్స్ సినిమాలకు పెద్ద ఝలక్‌ ఇచ్చారు. ఇకపై టికెట్‌ రేట్ల పెంపు కోసం వస్తే ఈ పని చేయాల్సిందే అంటూ మెలిక పెట్టారు. వచ్చే ఆదాయంలో 20శాతం సినిమా కార్మికులకు ఇస్తేనే టికెట్‌ రేట్లు పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్‌ రేట్ల పెంపు కోసం వచ్చే ప్రతి నిర్మాతకి, ఆయా సినిమాలు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంతటి ప్రభావితం చేయగలిగే వ్యక్తులున్నా, ఈ నియమాన్ని పాటించాల్సిందే అని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డికి సినీ ఫిల్మ్ ఫెడరేషన్‌ అభినందన సభ

తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆ మధ్య సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య వేతనాల విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. 30శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్‌ చేయగా, అందుకు నిర్మాతలు ససేమిరా అన్నారు. ఆ ఇష్యూ చాలా రోజులు కొనసాగింది. చాలా సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఇన్‌ వాల్వ్ అయ్యారు. ఆయన సమస్యని పరిష్కరించారు. కార్మికులకు సపోర్ట్ గా నిలవడంతో ఆయనకు కృతజ్ఞత చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా మంగళవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ పై విధంగా కామెంట్‌ చేశారు.

టికెట్‌ రేట్లు పెంపు విషయంలో నిర్మాతలకు సీఎం ఝలక్‌

ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, `పెద్ద పెద్ద సినిమాల నిర్మాతలు, హీరోలు నా వద్దకు వస్తుంటారు. సినిమా టికెట్‌ రేట్లు పెంచమని, ఆ సమయంలోనే నేను వారికి చెప్పాను, పెంచిన వాటిలో కొంతైనా కార్మికులకు ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. సినీ కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా. ఆ ఆదాయంలో 20శాతం కార్మికులకు ఇస్తేనే ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి అధికారులకు ఆదేశాలిస్తున్నా. భవిష్యత్‌లో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ప్రభావితం చేసే వ్యక్తి అయినా, వచ్చే ఆదాయంలో 20శాతం నా కార్మికుల కుటుంబాల వెల్ఫేర్‌కి బదిలీ జరిగితేనే, ఆ ఒప్పందానికి ఓకే అంటేనే టికెట్‌ రేట్లు పెంచుతూ జీవో వస్తుంది. ఈ నిబంధనలను సవరిస్తాను` అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

సినీ కార్మికుల పిల్లలకు కార్పొరేట్‌ రేంజ్‌లో స్కూల్‌ 

ఈ సందర్భంగా కార్మికులకు మరో హామీ ఇచ్చారు సీఎం. కృష్ణానగర్‌లో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించానని, ఆయా స్థాలంలో ప్రభుత్వం ఒక కార్పొరేట్‌ స్టయిల్‌లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సినీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు స్కూల్‌ని నిర్మిస్తానని తెలిపారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని, హాలీవుడ్‌ సినిమాలు కూడా మన హైదరాబాద్‌కి వచ్చి షూటింగ్‌లు జరిగేలా ఆ స్థాయిలో ఇక్కడి పరిశ్రమని అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. 

సినీ కార్మికుల వెల్ఫేర్‌ కోసం పది కోట్లు

సినీ కార్మికుల కోసం ఒక ప్రత్యేకంగా వెల్ఫేర్‌ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు సీఎం. ఈ వెల్ఫేర్‌ ఫండ్‌కి తాను పది కోట్లు ఇస్తున్నట్టుగా తెలిపారు. మహాభారతంలో కర్ణుడి మాదిరిగా, స్నేహితుల కోసం నిలబడే కర్ణుడిగా, తాను మీ కోసం నిలబడతానని, మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు సీఎం. ప్రభుత్వం నిర్మించి ఫ్యూచర్‌ సిటీలో మీరు ఉండేవిధంగా ఏర్పాటు చేస్తామని, అలాగే కార్మికుల కోసం ప్రత్యేకంగా భవనం నిర్మిస్తానని, ఇతర సంఘాల వారికి కూడా కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు సీఎం.