ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే జగన్ సంచలన నిర్ణయాలవైపు అడుగులు వేస్తున్నారు. పాలనా, రాజకీయ పరమైన సంచలనాలు ఎలాగూ ఉంటాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఓ విషయం అందరిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతోంది. భవిష్యత్తులో ఏపీకి టాలీవుడ్ ని తరలించాలనే వాదన ఉంది. అలా కాకుండా హైదరాబాద్ తో పాటు వైజాగ్ కేంద్రంగా కూడా టాలీవుడ్ ని అభివృద్ధి పరచాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది జరగాలంటే ప్రభుత్వం నుంచి బలమైన నిర్ణయాలు వెలువడాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్ డి సి) పేరుతో ప్రయత్నాలు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు కొత్త చైర్మన్ ని నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ పదవి కోసం అప్పుడే కొందరు నటుల మధ్య పోటీ మొదలైపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

సీనియర్ నటుడు మోహన్ బాబు, కమెడియన్ అలీ, రాజశేఖర్ దంపతులు, జయసుధ ఎన్నికలకు ముందు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరుపున ప్రచారం కూడా నిర్వహించారు. వీరంతా చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జయసుధ, మోహన్ బాబులలో ఎవరో ఒకరికి చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి సీఎం జగన్ మనసులో ఎవరున్నారో!