బి.ఏ. రాజు నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నానంటున్నారు చిరంజీవి, 37ఏళ్లుగా ఉన్న మంచి స్నేహితుడిని కోల్పోయానంటున్నారు నాగార్జున. మాటలు రావడం లేదంటున్నారు వెంకటే. ఆయనతో పనిచేయడం గొప్పఅనుభవం అన్నారు ప్రభాస్‌. రామ్‌, మంచు విష్ణు, దర్శకులు, నిర్మాతలు ఇలా తెలుగు చిత్రపరిశ్రమ వర్గాలే కాదు, తమిళ చిత్ర హీరోలు సైతం బి.ఏ.రాజు మరణంపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. బి.ఏ.రాజు శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

చిరంజీవి సైతం ఎమోషనల్‌ అయ్యారు.  ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందిస్తూ, `బి.ఏ.రాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఆయన నాతో పంచుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని. షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారు. నా చాలా సినిమాలకు ఆయన పీఆర్‌ ఓ గా చేశారు. సినిమాల సమస్త సమాచారం.. సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్ కి సంబంధించిన కలెక్షన్స్ ట్రేడ్‌ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్‌ ఆయన. 

ఏ సినిమా ఏ తేదిన రిలీజైంది? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్‌లో ఎన్ని రోజులు ఆడింది. వంద రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకి ఎన్‌ సైక్లోపెడియాలా సమాచారం అందించేంత ప్యాషన్‌ ఉన్న పత్రికా జర్నలిస్ట్. మేధావి. సూపర్‌ హిట్‌ సినీ మ్యాగజైన్‌ క్త, అనేక సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన బి.ఏ.రాజు లాంటి వారు ఉండటం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేరన్న వార్త విని షాక్‌కి గురయ్యాను.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసాగుభూతి తెలియజేస్తున్నా` అని  అన్నారు.

నాగార్జున తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా గొప్ప ఫ్రెండ్‌ని కోల్పోయానని ఎమోషనల్‌ అయ్యారు. `గత 37ఏళ్లుగా నా వెల్‌ విషర్‌, మంచి స్నేహితుడు బి.ఏ.రాజుగారు. ఆయన్ని మేం చాలా మిస్‌ అవుతున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మిస్‌ అవుతుంది` అని పేర్కొన్నారు.

విక్టరీ వెంకటేష్‌ స్పందిస్తూ, `బి.ఏరాజుగా లేరనే వార్తతో నాకు మాటలు రావడం లేదు. నా మొదటి సినిమా నుంచి ఆయన తెలుసు. ఆయన మంచి హృదయం కలిగిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం తీరని లోటు` అని చెప్పారు.

ప్రభాస్‌ స్పందిస్తూ, బి.ఏ.రాజు ఆకస్మిక మరణంతో షాక్‌కి గురయ్యాను. ఆయన నా ఫ్యామిలీ మెంబర్‌ లాంటి వారు. నా కెరీర్‌లో చాలా సినిమాలకు ఆయనతో పనిచేశాను. ఆయనతో పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ అనందిస్తాను. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద నష్టం` అని చెప్పారు.

దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్‌ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. `బి.ఏ.రాజు ఆకస్మిక మరణంతో నిజంగా షాక్‌ అయ్యాను. 1500కిపైగా చిత్రాలకు పీఆర్వోగా, అలాగే ఫిల్మ్ జర్నలిస్ట్‌ గా పనిచేసిన అనుభవం ఆయనది. తనలాంటి సినీయర్‌ సభ్యుడిని కోల్పోవడం నింపలేని శూన్యత` అని చెప్పారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ట్వీట్‌ ద్వారా ఎమోషనల్‌ అయ్యారు.`ఎప్పుడూ నవ్వుతున్న ముఖం. ఆ పాజిటివ్‌ ఎనర్జీ. ఆ ప్రోత్సాహక మాటలు, మీరు దయగల వారు. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం` అని అన్నారు. 

వీరితోపాటు మంచు విష్ణు, మంచు మనోజ్‌, నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.