టాలీవుడ్ లో పదేళ్ల కెరీర్ దాటినా... కాజల్ అగర్వాల్ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రేజీ ఫీలింగే... కాజల్ ను చిరు సరసన హీరోయిన్ ను చేసింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన రెండు పాటల షూటింగ్ కోసం టీం యూనిట్ యూరోప్ వెళ్లిందది. అక్కడ కాజల్ మెగాస్టార్ సరసన పాట కోసం స్టెప్పులేస్తూ సరదాగా తీసిన పోటో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అప్ లోడ్ చేసి మెగా అభిమానులకే కాక అందరికీ కనువిందు చేస్తోంది.
చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం షూటింగ్ సరదా సరదాగా జరుగుతోంది. ఈ చిత్రంలోని పాటల షూటింగ్ ప్రస్తుతం స్లోవేనియా, క్రొయేషియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా సెట్‌లో సరదాగా దిగిన ఫొటోలను చిత్రం కాస్టూమ్స్ డిజైనర్, చిరు కుమార్తె సుస్మిత, కథానాయిక కాజల్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తున్నారు. అక్కడి ప్రకృతి చక్కగా ఉందని, షూట్ చేయడానికి దీని కన్నా మంచి ప్రదేశం దొరకదని సుస్మిత ట్వీట్ చేసింది. కాగా తాజాగా కాజల్ అగర్వాల్ తన ఖాతాలో చిరు పక్కనున్న పిక్ అప్ లోడ్ చేసింది.
వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తరుణ్ అరోరా ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.
