మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో వస్తోన్న ‘ఆచార్య’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరకుంది.  దాంతో ఆయన అభిమానుల దృష్టి ..చిరు చేయబోయే తర్వాత ప్రాజెక్టు విశేషాలపై పడింది. మెగాస్టార్ హీరోగా మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేస్తున్నారు. చిత్రానికి మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సినిమా ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్‌ని ఆరు నెల్లల్లోనే పూర్తి చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కొన్ని ఇంట్రస్టింగ్ న్యూస్ లు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి పెట్టబోయే టైటిల్ ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు రారాజు అనే టైటిల్ పెట్టబోతున్నట్లు  మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ఇమేజ్ ఫెరఫెక్ట్ గా మ్యాచ్ అవ్వటంతో పాటు, క్యాచీగా ఉంటుందని ఈ టైటిల్ ని ఫైనలైజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉందిట. 

ఇక ఒరిజనల్ లో మోహన్‌లాల్‌ పోషించిన స్టీఫెన్‌ పాత్రను చిరు పోషిస్తున్నారు. అందులో ఆ పాత్ర మొదటి నుంచి చివరి వరకూ గంభీరంగా ఉంటుంది. కానీ, తెలుగు చిత్రానికి వచ్చే సరికి కేవలం మాతృక కథలోని ఆత్మను మాత్రం తీసుకుని చిరు అభిమానులు కోరుకున్న మాస్‌ అంశాలన్నీ జోడించారట. అంతేకాదు, హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని టాక్‌. ఇక చిరంజీవి సినిమా అంటే అదిరే స్టెప్‌లు ఉండాల్సిందే. మలయాళంలో అసలు వాటి జోలికే పోలేదు.(ఐటమ్‌ సాంగ్‌ తప్ప) కానీ, తెలుగులో చిరు ఇమేజ్‌కు తగ్గట్టు పాటలు ఉంటాయని టాక్‌. అంతేకాదు, ‘లూసిఫర్‌’ను మించి ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. మరి నిజంగా ఈ మార్పులన్నీ  చేస్తే అవి ఈ సినిమాకు ప్లస్‌ అవుతాయా? లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే!

నటుడు సత్యదేవ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్రసీమకు చెందిన మోహన్ రాజా ‘హనుమాన్ జంక్షన్’ ద్వారా తెలుగుకు పరిచయమయ్యారు. ఇక్కడ విజయవంతమైన పలు సినిమాలను తమిళంలో రీమేక్‌ చేశారు. చిరంజీవి న‌టించిన ‘హిట్లర్‌‘ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ ప‌ని చేశాడు. ఇన్నాళ్లకు మెగాస్టార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.