దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో 'సింహ','లెజెండ్' వంటి సినిమాలను రూపొందించి భారీ విజయాలను అందుకున్నాడు. అయితే బాలకృష్ణ మీద పెట్టిన దృష్టి ఇతర హీరోల మీద పెద్దగా పెట్టడనేవిమర్శలు బోయపాటిపై వినిపిస్తుంటాయి.

ప్రస్తుతం బోయపాటి.. రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ని ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

టీజర్ ని బట్టి ఇది పక్కా మాస్ కమర్షియల్ ఫిల్మ్ అని తెలుస్తోంది. జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రషెస్ ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చూశారట. 
రషెస్ చూసిన ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. కనీసం రీషూట్స్ చేద్దామంటే చరణ్.. రాజమౌళి సినిమాతో బిజీ అయిపోతున్నాడు. 

ఒక నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇక రీషూట్స్ సంగతి పక్కన పెట్టేశారు. చరణ్ సినిమా విషయంలో బోయపాటి ఇంతగా అసంతృప్తి చెందేలా చేస్తాడని ఊహించని చిరు అతడితో చేయాలనుకున్న సినిమాని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చిరు 'సైరా'లో నటిస్తున్నారు. అది పూర్తయిన తరువాత బోయపాటితో సినిమా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొరటాల శివని లైన్ లోకి తీసుకొచ్చారు. మొత్తానికి 'వినయ విధేయ రామ' ఎఫెక్ట్ తో చిరంజీవి చేయాల్సిన సినిమాను క్యాన్సిల్ చేసేశారు.